కొయ్యూరు: ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియను అత్యంత వేగవంతంగా పూర్తి చేయాలని జాయింట్ కలెక్టర్ తిరుమణి శ్రీపూజ అధికారులను ఆదేశించారు. ఆదివారం ఆమె కొయ్యూరు మండలంలోని మల్లవరం (బూత్ నంబర్ 108), డౌనూరు (బూత్ నంబర్ 109) గ్రామాల్లో పర్యటించి, క్షేత్రస్థాయిలో జరుగుతున్న పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ నేరుగా ప్రజలతో మాట్లాడారు. 2002లో ఓటర్ల జాబితాలో పేరు లేని వారు తప్పనిసరిగా తమ తల్లి లేదా తండ్రి ఓటు వివరాలను ధృవీకరణ కోసం చూపించాల్సి ఉంటుందని ఆమె వివరించారు. ఎన్యూమరేషన్ ఫారాలు అందిన వెంటనే, ప్రజలు వాటిని పూర్తి చేసి ఫోటోలను అతికించి, ఆధార్ కార్డును జతపరచాలని కోరారు. ఒకవేళ 2002లో తమకు ఓటు లేకపోతే, తమ తల్లిదండ్రులలో ఎవరో ఒకరి ఓటరు కార్డును లేదా జాబితాలోని సీరియల్ నంబర్‌ను బీఎల్వోలకు చూపించాలని ఆమె సూచించారు.
సకాలంలో పూర్తి చేయాలి
ఓటర్ల నమోదుకు గడువు తక్కువగా ఉన్న నేపథ్యంలో, ప్రజలందరూ బీఎల్వోలకు పూర్తి సహకారం అందించాలని ఆమె కోరారు. మండలంలోని అన్ని బూత్‌లలో పనితీరుపై తహసీల్దారు ప్రసాదరావుతో ఆమె సమీక్షించారు. డిజిటలైజేషన్ ప్రక్రియ మందకొడిగా సాగుతున్న బూత్‌లపై ప్రత్యేక దృష్టి సారించి, ఎలాంటి జాప్యం లేకుండా నిర్ణీత గడువులోగా పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేకాధికారి, డీఎల్పీవో పీఎస్ కుమార్, ఎంపీడీవో ప్రసాదరావు, వీఆర్వో సుజాత, పంచాయతీ కార్యదర్శి రాము, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
జాయింట్ కలెక్టర్ తిరుమణి శ్రీపూజ ఆదేశం
మల్లవరం, డౌనూరులో పర్యటన
బీఎల్వోలకు సహకరించాలనిప్రజలకు విజ్ఞప్తి


