కలెక్టర్ నిశాంతి
సాక్షి, పాడేరు: ప్రజాస్వామ్యంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించడమే ధ్యేయంగా ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమాన్ని చేపట్టినట్లు కలెక్టర్ టి. నిశాంతి తెలిపారు. ఆదివారం కలెక్టరేట్‌లో అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగంతో పాటు, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఆమె సమావేశం నిర్వహించారు.
చట్ట నిబంధనల ప్రకారమే సవరణలు
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. నియోజకవర్గాల వారీగా కొత్త ఓటర్ల నమోదు, తప్పుల సవరణ, మరణించిన లేదా శాశ్వతంగా వలస వెళ్లిన వారి పేర్ల తొలగింపు ప్రక్రియను చట్ట నిబంధనల మేరకు చేపట్టాలని ఎన్నికల అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. ఈ ప్రక్రియలో రాజకీయ పార్టీల సహకారం ఎంతో కీలకమని, క్షేత్రస్థాయిలో ఏవైనా అభ్యంతరాలు లేదా సూచనలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని ఆమె కోరారు. రాజకీయ పార్టీల నేతలు వ్యక్తం చేసిన పలు సూచనలను నిబంధనల మేరకు పరిశీలిస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు.
అలసత్వం వహిస్తే చర్యలు
ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో అలసత్వం వహించే బీఎల్వోలపై కఠిన చర్యలు తీసుకోవాలని అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం కలెక్టర్‌కు విజ్ఞప్తి చేశారు. మారుమూల గ్రామాల్లోని ప్రతి పోలింగ్ బూత్ పరిధిపై ప్రత్యేక దృష్టి సారించాలని, బీఎల్వోలు తప్పనిసరిగా ఇంటింటికీ వెళ్లేలా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించేలా యంత్రాంగం పనిచేయాలని సూచించారు. ఈ సమావేశంలో జేసీ తిరుమణి శ్రీపూజ, ఐటీడీఏ పీవో ఆదిత్యవర్మ, డీఆర్వో లోకేశ్వరరావు, ఆర్డీవో భుజంగరావు, టీడీపీ నేత ఎస్. దొన్నుదొర, మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి, జనసేన నేత సీదరి రామ్మూర్తి, బీజేపీ నేత ఎస్. వేమనబాబు తదితరులు పాల్గొన్నారు.


