తల్లీబిడ్డ క్షేమం: సూపరింటెండెంట్ ధరణి
ముంచంగిపుట్టు: ని స్థానిక సీహెచ్‌సీలో వైద్యులు అరుదైన ప్రసవాన్ని విజయవంతంగా నిర్వహించారు. మాకవరం పంచాయతీ లబడపుట్టు గ్రామానికి చెందిన గర్భిణి, పురిటి నొప్పులతో మూడు రోజుల క్రితం ఆసుపత్రిలో చేరింది. అప్పటి నుంచి సీహెచ్‌సీ సూపరింటెండెంట్ డాక్టర్ ధరణి పర్యవేక్షణలో స్టాఫ్ నర్సులు వసంత, నూకలమ్మ, వైద్య సిబ్బంది ఆమెకు నిరంతరం వైద్య సేవలు అందించారు.
ఆరోగ్యంగా తల్లీబిడ్డ
ఆదివారం ప్రసవ వేదన తీవ్రం కావడంతో, డాక్టర్ ధరణి నేతృత్వంలోని బృందం ఎంతో చాకచక్యంగా సాధారణ ప్రసవం (నార్మల్ డెలివరీ) చేశారు. ఈ ప్రసవంలో గర్భిణి ఏకంగా 4.2 కిలోల బరువున్న పండంటి మగశిశువుకు జన్మనిచ్చింది. సాధారణంగా శిశువులు 2 నుంచి 3 కిలోల బరువుతో జన్మిస్తుంటారని, కానీ 4.2 కిలోల బరువున్న శిశువు సాధారణ ప్రసవంతో జన్మించడం చాలా అరుదైన విషయమని డాక్టర్ ధరణి పేర్కొన్నారు. ప్రస్తుతం తల్లి, బిడ్డ ఇద్దరూ క్షేమంగా, ఆరోగ్యంగా ఉన్నారని ఆమె తెలిపారు. క్లిష్టమైన సమయంలో తమకు అండగా నిలిచి సుఖ ప్రసవం చేసిన వైద్యులకు, సిబ్బందికి బాలింత కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.


