● కొనసాగుతున్న నీటి విడుదల
● వెయ్యి నుంచి
2,500 క్యూసెక్కులకు పెంపు
ముంచంగిపుట్టు: ఆంధ్రా–ఒడిశా సరిహద్దుల్లో ఉమ్మడిగా నిర్వహిస్తున్న మాచ్‌ఖండ్ జల విద్యుత్ కేంద్రానికి నీరందించే డుడుమ జలాశయంలో నీటి మట్టం ప్రమాదస్థాయికి చేరుకుంటోంది. రెండు రాష్ట్రాల్లోనూ విస్తారంగా కురుస్తున్న భారీ వర్షాలకు జలాశయంలోకి వరద నీరు భారీగా వచ్చి చేరుతోంది.
ప్రమాదస్థాయిలో నీటిమట్టం
మొత్తం 2590 అడుగుల గరిష్ట నీటి నిల్వ సామర్థ్యం కలిగిన డుడుమ జలాశయంలో, ఆదివారం నాటికి నీటి మట్టం 2588.60 అడుగులకు చేరుకుంది. జలాశయం ప్రమాదస్థాయికి చేరుకోవడంతో అప్రమత్తమైన అధికారులు, సిబ్బంది ఏడవ నంబర్ గేటును మూడు అడుగుల మేర పైకెత్తి, సుమారు 2,500 క్యూసెక్కుల నీటిని బలిమెల జలాశయానికి విడుదల చేస్తున్నారు.
నిరంతరం పర్యవేక్షణ
వర్షాలు ఇదే విధంగా కొనసాగితే జలాశయానికి ముప్పు పొంచి ఉందని భావించిన ప్రాజెక్టు అధికారులు, సిబ్బంది నిరంతరం నీటి నిల్వలను పర్యవేక్షిస్తున్నారు. జలాశయ నీటి మట్టాన్ని ప్రమాదస్థాయి నుంచి సాధారణ స్థితికి తీసుకువచ్చేందుకు అధికారులు అన్ని చర్యలు చేపడుతున్నారు.


