సర్‌.. ఎక్కడ? | - | Sakshi
Sakshi News home page

సర్‌.. ఎక్కడ?

Jul 5 2026 3:00 AM | Updated on Jul 5 2026 3:00 AM

సచివాలయాల వద్ద కనిపించని

బీఎల్వోలు, సిబ్బంది

ఆదేశాలు భేఖాతరు

నేడు అన్ని సచివాలయల్లో

అందుబాటులో సిబ్బంది..డీఆర్వో

లోకేశ్వరరావు వెల్లడి

సాక్షి,పాడేరు: కేంద్ర ఎన్నికల సంఘం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఓటర్ల జాబితా సమగ్ర సవరణ కార్యక్రమం పాడేరు ఏజెన్సీలో గందరగోళంగా మారింది. శనివారం జిల్లావ్యాప్తంగా అన్ని గ్రామ సచివా లయాల్లో ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించాలని ఆదేశాలు ఉన్నప్పటికీ, క్షేత్రస్థాయిలో ఆ పరిస్థితులు కనిపించలేదు.

బోసిపోయిన కేంద్రాలు

మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఏజెన్సీలోని మెజారిటీ సచివాలయాల వద్ద బీఎల్వోలు గానీ, ఇతర సిబ్బంది గానీ అందుబాటులో లేకపోవడంతో కేంద్రాలు వెలవెలబోయాయి. అరకు నియోజకవర్గ పరిధిలోని 306, పాడేరు నియోజకవర్గ పరిధిలోని 318 మొత్తం 624 పోలింగ్‌ బూత్‌లలో కనీసం తాళాలు కూడా తీయలేదు. ఈ బూత్‌లన్నీ ఎక్కువగా పాఠశాల భవనాల్లోనే ఉండటంతో, అక్కడ విద్యార్థులు, ఉపాధ్యాయులు మాత్రమే కనిపించారు తప్ప, ఓటర్ల జాబితా సవరణ కోసం ఎవరూ హాజరు కాలేదు.

అధికారుల వివరణ

గ్రామసచివాలయాల్లో ఈ కార్యక్రమం జరగకపోవడంపై డీఆర్వో లోకేశ్వరరావును వివరణ కోరగా, కొన్ని బూత్‌ల పరిధిలో మాత్రం బీఎల్వోలు ఇంటింటికీ తిరిగి ఎన్యుమరేషన్‌ ఫారాల పంపిణీ, ఓటర్ల నుంచి దరఖాస్తుల స్వీకరణ వంటి కార్యక్రమాలను చేపట్టారని తెలిపారు. సమయం తక్కువగా ఉండటం, మారుమూల ప్రాంతాల భౌగోళిక పరిస్థితుల వల్ల కొంత జాప్యం జరిగి ఉండవచ్చని ఆయన పేర్కొన్నారు. ఏది ఏమైనప్పటికీ, ఆదివారం మాత్రం అన్ని పోలింగ్‌ బూత్‌లలో ఎన్నికల సిబ్బంది తప్పనిసరిగా అందుబాటులో ఉంటారని, ఓటర్లు తమ పేర్ల నమోదుకు లేదా మార్పులకు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement