గందరగోళంగా ఓటరు సర్వే | - | Sakshi
Sakshi News home page

గందరగోళంగా ఓటరు సర్వే

Jul 5 2026 3:00 AM | Updated on Jul 5 2026 3:00 AM

వైఎస్సార్‌సీపీ శ్రేణులు అప్రమత్తంగాఉండాలి

మాజీ ఎమ్మెల్యే కొట్టగుల్లి భాగ్యలక్ష్మి

ముంచంగిపుట్టు: కేంద్ర ఎన్నికల సంఘం నిర్వహిస్తున్న స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌ (సర్వే) కార్యక్రమంలో క్షేత్రస్థాయిలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయని ఎస్టీ సెల్‌ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు, పాడేరు మాజీ ఎమ్మెల్యే కొట్టగుల్లి భాగ్యలక్ష్మి ఆందోళన వ్యక్తం చేశారు. శనివారం మండల కేంద్రానికి వచ్చిన ఆమె, జడ్పీ చైర్‌పర్సన్‌ జల్లిపల్లి సుభద్రతో కలిసి సర్వే నిర్వహణలో ఉన్న లోపాలు, తాజా పరిస్థితులపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా భాగ్యలక్ష్మి మాట్లాడుతూ, గ్రామాల్లో జరుగుతున్న ఈ సర్వే కార్యక్రమంపై వైఎస్సార్‌సీపీ బీఎల్‌ఏలు అప్రమత్తంగా ఉండాలని, ఎక్కడైనా తేడాలు కనిపిస్తే వెంటనే అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు. పోలింగ్‌ కేంద్రాల పరిధిలో బీఎల్వోలతో కలిసి బీఎల్‌ఏలు ప్రతి ఇంటికీ వెళ్లి, సర్వేను పారదర్శకంగా పర్యవేక్షించాలని కోరారు. ఎన్యుమరేషన్‌ ఫారాలను రెండు కాపీలు తీసుకుని, పూర్తి వివరాలు సేకరించాలని తెలిపారు. మరో పది రోజుల్లో సర్వే ముగిసే అవకాశం ఉందని, గిరిజన గ్రామాల్లో ఈ ప్రక్రియ నత్తనడకన సాగుతోందని ఆమె పేర్కొన్నారు. ఎన్యుమరేషన్‌ ఫారాల్లో వివరాలు సరిగ్గా లేకున్నా, లేదా ఫారాలు తిరిగి ఇవ్వకపోయినా ఓట్లు తొలగిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. 2002కు ముందున్న ఓట్లను, 2024 ఓటర్ల జాబితాతో సరిపోల్చి మ్యాపింగ్‌ చేయడం అత్యంత కీలకమని ఆమె గుర్తుచేశారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement