ఓటర్ల డిజిటలైజేషన్‌పై సమీక్ష | - | Sakshi
Sakshi News home page

ఓటర్ల డిజిటలైజేషన్‌పై సమీక్ష

Jul 5 2026 3:00 AM | Updated on Jul 5 2026 3:00 AM

సాక్షి, పాడేరు: భారత ఎన్నికల కమిషన్‌ ప్రిన్సిపల్‌ సెక్రటరీ ఎస్‌బీ జోష్‌ శనివారం పాడేరులో పర్యటించారు. జిల్లాలో ఓటర్ల జాబితా సమగ్ర సవరణ కార్యక్రమంపై సమీక్షించేందుకు వచ్చిన ఆయనకు, జిల్లా కలెక్టర్‌ టి. నిశాంతి పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు. అనంతరం కలెక్టరేట్‌లో కలెక్టర్‌ అధ్యక్షతన ఎన్నికల అధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పాడేరు, అరకులోయ నియోజకవర్గాల్లో ఓటర్లకు ఎన్యుమరేషన్‌ ఫారాల పంపిణీ, ఓటర్ల డిజిటలైజేషన్‌ ప్రక్రియపై ఆయన సమగ్రంగా తెలుసుకున్నారు. జిల్లాలోని భౌగోళిక పరిస్థితులు, ఓటర్ల నమోదులో ఎదురవుతున్న సవాళ్లు, క్షేత్రస్థాయిలో సిబ్బంది నియామకాలపై కలెక్టర్‌ వివరించారు. గిరిజన ప్రాంతాల్లో అక్షరాస్యతతో పాటు డిజిటల్‌ అక్షరాస్యత తక్కువగా ఉందని, మారుమూల గ్రామాల్లో మొబైల్‌, ఇంటర్నెట్‌ కనెక్టివిటీ లేకపోవడం ఓటర్ల నమోదు ప్రక్రియకు ఆటంకంగా మారిందని కలెక్టర్‌ తెలిపారు. కష్టతరమైన కొండ ప్రాంతాలు, రవాణా సౌకర్యాలు లేకపోవడం, స్వల్ప జనాభాతో గ్రామాలు చెల్లాచెదురుగా ఉండటం, భాషా పరమైన సమాచార లోపాలు ఉన్నాయని వివరించారు. జిల్లాలోని అన్ని పోలింగ్‌ బూత్‌లలో ఎన్నికల సిబ్బంది పూర్తిస్థాయిలో అందుబాటులో ఉన్నారని ఆమె పేర్కొన్నారు. అనంతరం పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ ద్వారా ఓటర్ల జాబితా సవరణకు సంబంధించిన అన్ని అంశాలను ప్రిన్సిపల్‌ సెక్రటరీకి వివరించారు. ఈ కార్యక్రమంలో జేసీ తిరుమణి శ్రీపూజ, ఐటీడీఏ పీవో ఆదిత్యవర్మ, డీఆర్‌వో లోకేశ్వరరావు, ఆర్డీవో భుజంగరావు, అన్ని విభాగాల ఎన్నికల అధికారులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement