పాడేరు: ఇన్‌సర్వీస్ (పనిలో ఉన్న) ఉపాధ్యాయులకు ’టెట్ పరీక్ష నుంచి మినహాయింపు ఇవ్వాలని, అందుకు అనుగుణంగా విద్యా హక్కు చట్టాన్ని సవరించాలని ప్రభుత్వాలకు సిఫార్సు చేయాలని ఫ్యాఫ్టో జిల్లా చైర్మన్ రావుల జగన్‌మోహన్‌రావు కోరారు. ఈ మేరకు శనివారం ఫ్యాఫ్టో నాయకులు అరకు ఎంపీ డాక్టర్ గుమ్మా తనుజరాణిని, పాడేరు ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజును కలిసి వినతిపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఇన్‌సర్వీస్ టీచర్లకు టెట్ తప్పనిసరి చేయడం వల్ల ఉపాధ్యాయులు తీవ్ర మానసిక ఆందోళనకు గురవుతున్నారని, దీనివల్ల విద్యావ్యవస్థ కుంటుపడే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఒకవేళ అనివార్య పరిస్థితుల్లో టెట్ నిర్వహించాల్సి వస్తే, అందరికీ సమాన అవకాశాలు కల్పించేలా వారి వారి సబ్జెక్టుల ప్రాతిపదికన పరీక్ష నిర్వహించాలని కోరారు. ఈ సమస్యను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లి త్వరితగతిన పరిష్కరించాలని నాయకులు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఫ్యాఫ్టో ప్రధాన కార్యదర్శి పలాసి కర్రన్న, యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఉమామహేశ్వరరావు, బీటీఏ జిల్లా అధ్యక్షుడు వల్ల వెంకటరమణ, ప్రధానోపాధ్యాయుల సంఘం జిల్లా ప్రతినిధి కంబిడి నాగరాజు, ఏపీటీఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు అంబిడి శ్యాం సుందర్, శెట్టి శాంతికుమారి, బాబురావు, సోంబాబు, రమ్యప్రియ, సూర్యమణి తదితరులు పాల్గొన్నారు.
ఇన్‌సర్వీస్ టీచర్ల వినతి


