చేరేదెలా? | - | Sakshi
Sakshi News home page

చేరేదెలా?

Jul 5 2026 3:00 AM | Updated on Jul 5 2026 3:00 AM

భోగాపురం
భోగాపురం ఎయిర్‌పోర్టుకు మెట్రో అనుసంధానం అత్యవసరమన్న నీతిఆయోగ్‌ 2030 నాటికి 77 కిలోమీటర్ల లైన్‌ పూర్తి కావాలని స్పష్టీకరణ గ్లోబల్‌ బెంచ్‌మార్క్‌ ప్రకారం విశాఖకు 150 కిలోమీటర్ల నెట్‌వర్క్‌ అవసరం

సాక్షి, విశాఖపట్నం: ఉత్తరాంధ్ర ప్రజల ఎన్నో ఏళ్ల కలగా రూపుదిద్దుకున్న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం అందుబాటులోకి వచ్చే వేళ.. దానికి నగరం నుంచి సమర్థవంతమైన ప్రజారవాణా అనుసంధానం లేకపోవడం ప్రధాన ఆందోళనగా మారింది. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో శంకుస్థాపన జరిగి వేగంగా నిర్మాణం పూర్తిచేసుకున్న ఈ విమానాశ్రయం ప్రాంతీయ అభివృద్ధికి కీలక మైలురాయిగా నిలవనుంది. అయితే విమానాశ్రయానికి వేలాది మంది ప్రయాణికులు సులభంగా చేరుకునేలా వైజాగ్‌ మెట్రోను పూర్తి చేయాల్సిన అవసరాన్ని కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన నీతిఆయోగ్‌ సైతం స్పష్టంగా ప్రస్తావించినా.. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఇప్పటికీ కార్యాచరణలో వేగం చూపడం లేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

2030 లక్ష్యం.. ప్రస్తుతం సున్నా..

ఇటీవల విడుదలైన ’విశాఖపట్నం ఎకనమిక్‌ రీజియన్‌ గ్రోత్‌ హబ్‌ మాస్టర్‌ప్లాన్‌’లో నీతిఆయోగ్‌ విశాఖ నగర భవిష్యత్‌ రవాణా అవసరాలపై స్పష్టమైన దిశానిర్దేశం చేసింది. 2028–2030 మధ్యకాలంలో కనీసం 77 కి.మీ మెట్రో నెట్‌వర్క్‌ను పూర్తి చేయాలని సూచించింది. అయితే ప్రస్తుతం నగరంలో ఒక్క కిలోమీటరు మెట్రో మార్గం కూడా అందుబాటులో లేకపోవడాన్ని నివేదిక ప్రస్తావించింది. అంతేకాదు.. ప్రపంచ స్థాయి ప్రమాణాలను పరిశీలిస్తే విశాఖ పరిమాణంలోని నగరానికి 100 నుంచి 150 కిలోమీటర్లకు పైగా మెట్రో నెట్‌వర్క్‌ అవసరమని పేర్కొంది. భవిష్యత్‌ జనాభా, పారిశ్రామిక విస్తరణ, విమానాశ్రయం, పోర్టు కార్యకలాపాలను దృష్టిలో ఉంచుకుని మెట్రో వ్యవస్థను వేగంగా అభివృద్ధి చేయాల్సిన అవసరాన్ని నొక్కిచెప్పింది.

కాగితాలపై ఫేజ్‌లు

రాష్ట్ర ప్రభుత్వం ఫేజ్‌–1, ఫేజ్‌–2 డీపీఆర్‌లు అంటూ కేవలం కాగితాలపైనే కాలయాపన చేస్తోంది తప్ప క్షేత్రస్థాయిలో అడుగులు వేయడం లేదు. కేంద్ర అనుమతులు, నిధుల సమీకరణలో అవసరమైన చొరవ కనిపించడం లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. భోగాపురం విమానాశ్రయం పూర్తిస్థాయిలో కార్యకలాపాలు ప్రారంభమైన తర్వాత వేలాది మంది ప్రయాణికులు, ఉద్యోగులు, సరుకు రవాణా వాహనాలు ఒకేసారి రోడ్లపైకి వస్తాయి. అలాంటి పరిస్థితుల్లో మెట్రో వంటి భారీ ప్రజారవాణా వ్యవస్థ లేకుంటే నగర ట్రాఫిక్‌పై తీవ్ర ఒత్తిడి పడే అవకాశముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

బీచ్‌ కారిడార్‌ నత్తనడకనే..

వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో 2023 గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌ సందర్భంగా విశాఖ నుంచి భోగాపురం వరకు ఆరు వరుసల బీచ్‌ కారిడార్‌కు కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ ఆమోదం ప్రకటించారు. విశాఖ పోర్టు నుంచి రుషికొండ, భీమిలి మీదుగా భోగాపురాన్ని అనుసంధానించే ఈ 55 కిలోమీటర్ల ప్రాజెక్టుకు రూ.6,300 కోట్ల వ్యయాన్ని ప్రకటించారు. ప్రభుత్వం మారిన తర్వాత ఈ ప్రాజెక్టు భూసేకరణ, రహదారి విస్తరణ అంశాల వద్దే నిలిచిపోయింది. స్థానికుల అభ్యంతరాలు, మారిన ప్రతిపాదనల కారణంగా ఇప్పటికీ డీపీఆర్‌ దశను దాటలేకపోయింది.

ఐటీ అభివృద్ధికీ మెట్రో కీలకం

విశాఖను ఐటీ హబ్‌గా తీర్చిదిద్దాలంటే ప్రధాన ఐటీ కేంద్రాలకు ఒకటి నుంచి రెండు కిలోమీటర్ల పరిధిలో మెట్రో కనెక్టివిటీ ఉండాలని నీతిఆయోగ్‌ స్పష్టం చేసింది. మెరుగైన ప్రజారవాణా లేకపోవడం ఐటీ రంగ విస్తరణకు అడ్డంకిగా మారుతోందని నివేదిక పేర్కొంది. మెట్రో ప్రాజెక్టుకు కేంద్ర అనుమతులు, నిధుల మంజూరులో వేగం పెంచాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని కూడా సూచించింది.

మెట్రో ఇక లగ్జరీ కాదు.. అత్యవసరం

భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఉన్నా లేకపోయినా.. విశాఖ నగరానికి మెట్రో అత్యవసరం. ఒకవైపు సముద్రం, మరోవైపు కొండలతో సహజ పరిమితుల మధ్య విస్తరించిన నగరంలో భవిష్యత్‌ అవసరాలను దృష్టిలో పెట్టుకుని మెట్రోతో పాటు ఫ్లైఓవర్ల నిర్మాణం తప్పనిసరి. ప్రస్తుతం నగరంలో బాటిల్‌నెక్‌ రోడ్లు అధికంగా ఉండటంతో దాదాపు అన్ని ప్రధాన కూడళ్లలో ట్రాఫిక్‌ సమస్య తీవ్రంగా మారుతోంది. మెట్రో ప్రాజెక్టుకు సంబంధించిన మాస్టర్‌ప్లాన్‌లు, డీపీఆర్‌ల రూపకల్పనలో స్థానికుల అభిప్రాయాలను సమగ్రంగా పరిగణనలోకి తీసుకోకపోవడం వల్లే ఆలస్యం జరుగుతోంది. ఇకపై డీపీఆర్‌లలో మార్పుల పేరుతో కాలయాపన చేయకుండా వెంటనే నిర్మాణ ప్రక్రియ ప్రారంభించాలి.

– యల్లపు రఘురామ్‌, వాణిజ్య నిపుణుడు

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement