మ్యారేజ్‌ సర్టిఫికెట్‌ అత్యంత కీలకం.. | - | Sakshi
Sakshi News home page

మ్యారేజ్‌ సర్టిఫికెట్‌ అత్యంత కీలకం..

Jul 5 2026 3:00 AM | Updated on Jul 5 2026 3:00 AM

● వివాహ సర్టిఫికెట్లతో ఎన్నో ఉపయోగాలు ● నిబంధనలు ఇలా..

అనకాపల్లి: మారుతున్న కాలంలో వివాహ సర్టిఫికెట్లు తప్పని సరిగా ఉండాలని ప్రభుత్వం నిబంధనలు చేపడుతుంది. ఇటీవల సీజన్‌లో పెళ్లిళ్లు కొత్త జంటలు వివాహ ధ్రువీకరణ పత్రం తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. వీరి జీవితం కొత్తగా ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రభుత్వం నుంచి ఏవైనా ప్రభుత్వ పథకాలు రావాలన్నా, రేషన్‌ కార్డుల్లో మార్పులు, చేర్పులు చేయించాలన్నా, పాస్‌పోర్టు, భూములకు ఈ మ్యారేజ్‌ సర్టిఫికెట్‌ అవసరం చాలా ఉంటుంది. ఇలాంటి సమయాల్లో అప్పటికప్పుడు కార్యాలయాల చుట్టూ తిరిగి ఇబ్బందులు పడుతూ చివరికి సర్టిఫికెట్‌ కోసం ఇతరులపై ఆధారపడి ఎక్కువ మొత్తంలో సొమ్ములు చెల్లించుకోవాల్సి వస్తుంది. ఇలాంటి ఇబ్బందులను ముందుగానే గుర్తించి మ్యారేజ్‌ రిజిస్ట్రేషన్‌ చేసుకుని సర్టిఫికెట్‌ పొందితే వారికే మంచిది.

మ్యారేజ్‌ సర్టిఫికెట్‌ వల్ల ఉపయోగాలు...

పాస్‌పోర్టు అప్లికేషన్‌, బ్యాంక్‌ జాయింట్‌ అకౌంట్‌, కేంద్ర, రాష్ట్ర బలగాలల్లో విధులు నిర్వహిస్తున్న వారి సర్వీస్‌ రికార్డుల్లో పేర్లు మార్పుకునేందుకు, ఇతర దేశాల్లో ఉద్యోగాలు చేస్తున్న వారికి వీసా ప్రొసెస్‌, వీటితో పాటు ప్రభుత్వ పథకాలు పాందేందుకు మ్యారేజ్‌ సర్టిఫికెట్‌ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. నవ వధూవరులు పెళ్లి చేసుకునే ప్రదేశం ఆధారంగా గ్రామం అయితే గ్రామ సచివాలయం, పంచాయతీ కార్యాలయం, పట్టణ పరిధిలోవార్డు సచివాలయ, మున్సిపల్‌ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలి. రిజిస్ట్రేషన్‌ కోసం వివాహ శుభలేఖ, జీలకర్ర బెల్లం తలపై పెట్టుకున్న వధూవరుల ఫొటో, మంగళసూత్రం కట్టేటప్పుడు వధూవరుల ఫొటో, పూలదండలు మార్పుకునే ఫొటోలు ఉండాలి. పెళ్లి కుమారుడు, కుమార్తె జనన ధ్రువీకరణ పత్రాలు, చిరునామా ధ్రువీకరణ పత్రం, ఆధార్‌ కార్డుల జెరాక్స్‌లను జతచేయాలి, వధూవరుల తరపున ఇద్దరు సాక్షులు, వారి ఆధార్‌ కార్డుల జెరాక్సులను గ్రామ, వార్డు సచివాలయం లేదా గ్రామ ప్రంచాతీ కార్యాలయంలోగానీ, మున్సిపాల్‌ కార్యాలయంలో అందజేయాలి. జత చేసిన ధ్రువీకరణ పత్రాలను జనన, మరణ రిజిస్ట్రేషన్‌ అధికారి పరిశీలించి సర్టిఫికెట్‌ను జారీ చేస్తారు, ఆలయాల్లో వివాహం చేసుకుంటే దేవదాయశాఖ ముందుగానే నిర్దేశించిన రుసుం చెల్లిస్తే అధికారులు రశీదులు ఇస్తారు, వాటి ఆధారంగానే వివాహానికి సంబందించిన ఇతర పత్రాలు, ఫొటోలు, సాక్షుల ఽధ్రువీకరణ పత్రాలు జత చేయాల్సి ఉంటుంది. గృహాలు, కల్యాణ మండపాల్లో సంప్రదాయకంగా వివాహం చేసుకుంటే అందుకు తగ్గ అన్నిరకాలు పత్రాలు సమర్పించి దరఖాస్తులు చేసుకోవాలి.

90 రోజుల్లో రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలి

వివాహం జరిగిన 90 రోజుల్లో పంచాయతీ, గ్రామ సచివాలయం, మున్సిపాల్‌ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్‌ చేసుకుంటే తక్కువ ఫీజు ఉంటుంది. సాధారణంగా ఫీజు రూ.100 నుంచి 500 మాత్రమే ఉంటుంది. వివాహం జరిగిన 90 రోజులు దాటితే సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దీనికోసం ఆన్‌లైన్‌ల్లో స్లాట్‌ బుక్‌ చేసుకోవాలి, ఖర్చు అధికంగా అవుతుంది.

– ఆశా జ్యోతి, ఎంపీడీవో, అనకాపల్లి

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement