గణాంకాల
ఏజెన్సీలో ఓటర్ల నమోదు ప్రక్రియఅస్తవ్యస్తంగా సాగుతోంది. ఓవైపు ఎన్యుమరేషన్ ఫారాలు అందక గిరిజన ఓటర్లు ఇబ్బందులు పడుతుంటే, మరోవైపు అధికారులు మాత్రం అంతా సవ్యంగా జరిగిపోయిందని కమిషన్‌కు నివేదించి చేతులు దులుపుకుంటున్నారు. యంత్రాంగం అధికారిక లెక్కలు ఇప్పుడు జిల్లాలో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.
సాక్షి, పాడేరు: భారత, రాష్ట్ర ఎన్నికల కమిషన్ల ఆదేశాల మేరకు జిల్లాలో చేపట్టిన ఓటర్ల సమగ్ర సవరణ ప్రక్రియ నత్తనడకన సాగుతోంది. క్షేత్రస్థాయిలో పరిస్థితి ఒకలా ఉంటే, జిల్లా ఎన్నికల యంత్రాంగం నివేదికలు మరోలా ఉండటం గమనార్హం. ఓటర్లకు ఫారాలు అందలేదని ప్రజలు ఆరోపిస్తుంటే, వంద శాతం పంపిణీ పూర్తయిందని అధికారులు కమిషన్‌కు నివేదికలు పంపడం చర్చనీయాంశంగా మారింది.
నివేదికల్లోనే నూరుశాతం..
పాడేరు, అరకు నియోజకవర్గాల్లోని బూత్ లెవల్ అధికారులు ఉదయం నుంచి రాత్రి వరకు శ్రమిస్తున్నా, ఓటర్ల నమోదు ప్రక్రియలో వేగం కనిపించడం లేదు. మారుమూల గిరిజన గ్రామాల్లోని అనేకమంది ఓటర్లు తమకు ఎన్యూమరేషన్ ఫారాలు అందలేదని వాపోతున్నారు. కానీ, జిల్లా ఎన్నికల యంత్రాంగం మాత్రం తమకు అందిన గణాంకాల ప్రకారం 4,99,752 మంది ఓటర్లందరికీ (అరకులో 2,48,665, పాడేరులో 2,51,087) ఎన్యూమరేషన్ ఫారాలు వంద శాతం పంపిణీ చేశామని రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు నివేదించింది. అధికారుల అబద్ధపు లెక్కలు ఇప్పుడు గిరిజన గ్రామాల్లో చర్చకు దారితీస్తున్నాయి.
డిజిటలైజేషన్‌లోనూ వెనుకబడే..
ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ వంద శాతం పూర్తయిందని గొప్పగా చెప్పుకుంటున్న జిల్లా యంత్రాంగం, ఓటర్ల డిజిటలైజేషన్ విషయానికి వచ్చేసరికి వాస్తవాలను బయటపెట్టింది. జిల్లాలో ఇప్పటివరకు కేవలం 29.93 శాతం (1,49,558 మంది) ఓటర్ల వివరాలు మాత్రమే డిజిటలైజ్ అయ్యాయి. ఇంకా 3,50,194 మంది ఓటర్ల డేటా పెండింగ్‌లోనే ఉంది. అలాగే, 80.72 శాతం మందికి (4,03,406 మంది) మ్యాపింగ్ ప్రక్రియ పూర్తి కాగా, మరో 96,346 మందికి ఇంకా మ్యాపింగ్ చేయాల్సి ఉంది.
బీఎల్వోల తిప్పలు..
ఫారాలు పంపిణీ చేసిన తర్వాత, వాటిని తిరిగి సేకరించడంలో బీఎల్వోలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గిరిశిఖర గ్రామాలకు పదేపదే వెళ్లడం సాధ్యం కాకపోవడంతో, మండల కేంద్రాలకే గ్రామ పెద్దల ద్వారా ఫారాలను, ఫొటోలను తెప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ప్రక్రియలో జరుగుతున్న జాప్యం, అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఓటర్లు గందరగోళానికి గురవుతున్నారు. ఎన్నికల ప్రక్రియలో అత్యంత కీలకమైన ఓటరు సవరణలో నెలకొన్న ఈ అలసత్వంపై గిరిజనులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
నత్తనడకన ఓటర్ల సమగ్ర సవరణ ప్రక్రియ
క్షేత్రస్థాయి పరిస్థితులకు భిన్నంగా నివేదికలు? గందరగోళంలో ఓటర్లు
ఫారం అందలేదు
ఓటర్ల సవరణకు సంబంధించి మా కుటుంబానికి ఇంత వరకు ఎన్నికల అధికారుల నుంచి ఫారం అందలేదు. తమ గ్రామంలో కొంతమందికే ఫారాలు ఇచ్చి మాకు మాత్రం ఇవ్వలేదు.
– సీదరి టింబురు,
జర్రిపాడు, డుంబ్రిగుడ మండలం


