పాడేరులో ‘సర్‌’.. 33 శాతమే! | - | Sakshi
Sakshi News home page

పాడేరులో ‘సర్‌’.. 33 శాతమే!

Jul 4 2026 2:19 AM | Updated on Jul 4 2026 2:19 AM

ప్రక్రియ పూర్తికి పదిరోజులే గడువు

అధికారులకు సవాల్‌గా మారిన

ఎన్నికల సంఘం ఆదేశాలు

కొయ్యూరు: ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ల ప్రత్యేక సవరణ (సర్వే) ప్రక్రియను ఈనెల 14 లోపు పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేసింది. అయితే, మైదాన ప్రాంతాలతో పోలిస్తే భౌగోళిక పరిస్థితులు భిన్నంగా ఉండే జిల్లా మన్యంలో ఈ గడువులోగా పని పూర్తి చేయడం అధికారులకు సవాలుగా మారింది.

● మైదాన ప్రాంతాల్లో రవాణా, ఇతర సదుపాయాలు మెరుగ్గా ఉండటంతో ప్రక్రియ త్వరితగతిన పూర్తవుతుంది. కానీ, మన్యంలో పరిస్థితి అందుకు భిన్నం. ఒక ఆధార్‌ కార్డు జిరాక్స్‌ కావాలన్నా, పాస్‌పోర్ట్‌ సైజు ఫోటో తీసుకోవాలన్నా మైళ్ల దూరం ప్రయాణించాల్సిన దుస్థితి ఉంది. ఓటర్ల జాబితా సవరణలో భాగంగా బీఎల్‌వోలు ఇచ్చిన ఫారమ్‌లకు ఫోటోలు జతపరచాల్సి ఉండగా, మారుమూల గ్రామాల ప్రజలకు ఫోటోల కోసం 15 నుంచి 20 కిలోమీటర్ల దూరం వెళ్లడం పెనుభారంగా మారింది.

కొనసాగుతున్న నత్తనడక..

ప్రస్తుత లెక్కల ప్రకారం పాడేరు నియోజకవర్గంలో సగటున 30 శాతం మాత్రమే ప్రక్రియ పూర్తయింది. అందులో పాడేరులో 33 శాతం, కొయ్యూరులో 32.26 శాతం, మిగిలిన మండలాల్లో 28 శాతం చొప్పున మాత్రమే పురోగతి నమోదైంది. ముఖ్యంగా మంప (బూత్‌ నం: 84) పరిధిలోని ఆర్‌. డొడ్డవరం, గంగవరం, తిటిపిట్ల వంటి గ్రామాలు ప్రధాన కేంద్రానికి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. బీఎల్‌వోలు ఇంటింటికీ తిరిగి ఫారంలు అందజేసినా, ఓటర్లు ఫొటోలు, ఆధార్‌ పత్రాలను సేకరించి తిరిగి ఇచ్చే లోపే ఒక రోజంతా గడిచిపోతోంది.

● పని భారంతో పాటు పైస్థాయి అధికారుల నుంచి పెరుగుతున్న ఒత్తిడితో క్షేత్రస్థాయి సిబ్బంది ఆందోళన చెందుతున్నారు. పరిస్థితిని గమనించిన తహశీల్దార్‌ ప్రసాదరావు, శుక్రవారం బూదరాళ్ల పంచాయతీలోని గరిమండ, వంతమర్రి, గొర్లెమెట్ట, కన్నవరం, పిట్లపాడు గ్రామాల్లో పర్యటించారు. ఈ ప్రక్రియను వేగవంతం చేసేందుకు అంగన్‌వాడీలు, కాఫీ బోర్డు లైజన్‌ వర్కర్ల సహాయం తీసుకుంటున్నారు. ఓటర్ల జాబితా సవరణలో స్థానికులు కూడా అధికారులకు పూర్తిస్థాయిలో సహకరించాలని ఆయన కోరారు. ఏది ఏమైనా, భౌగోళిక అవరోధాల మధ్య నిర్ణీత గడువులోగా ఈ ప్రక్రియ పూర్తి అవుతుందో లేదో వేచి చూడాలి.

పూర్తి చేయిస్తాం

ఎన్యూమరేషన్‌ ఫారంలకు జతపరచాల్సిన ఫొటోలు,ఆధార్‌ జెరాక్స్‌లకు ఇబ్బందులు వస్తున్నాయి.వెంటనే వాటిని సమకూర్చుకోలేకపోతున్నారు. ఇక నెట్‌ వ్‌ర్క్‌ సమస్యల మూలంగా అప్‌లోడ్‌ చేసేందుకు ఇబ్బందులున్నాయి. అయినా అందరి సహకారంతో ఈనెల పది నాటికే ప్రక్రియను పూర్తి చేయాలని నిర్ణయించాం.అంగన్‌వాడీ వర్కర్ల సహకారం తీసుకుంటున్నాం.

– కె. ప్రసాదరావు, తహసీల్దార్‌, కొయ్యూరు

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement