జాయింట్ కలెక్టర్ తిరుమణి శ్రీపూజ
సీలేరు: ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఓటర్ల నమోదు ప్రక్రియను నిర్దేశించిన సమయంలోగా పూర్తి చేయాలని, ఏ ఒక్క అధికారి నిర్లక్ష్యం వహించినా కఠిన చర్యలు తప్పవని పాడేరు జేసీ శ్రీపూజ తిరుమణి హెచ్చరించారు. శుక్రవారం ఆమె గూడెం కొత్తవీధి మండలంలో పర్యటించి, బీఎల్వోలతో సమావేశమయ్యారు. రోజుకు కనీసం 100 ఫారాల చొప్పున ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించారు.అరకు నియోజకవర్గంలో 34 శాతం, పాడేరు నియోజకవర్గంలో 30 శాతం ఫారాల సేకరణ పూర్తయిందని, ఈ నెల 14లోపు వంద శాతం ప్రక్రియ పూర్తి చేయాలని జేసీ స్పష్టం చేశారు. ఓటర్లు తమ బాధ్యతగా ఓటును నమోదు చేసుకోవాలని ఆమె కోరారు. పర్యటనలో భాగంగా స్థానికులు పలు సమస్యలను జేసీ దృష్టికి తీసుకెళ్లారు:ఆర్‌వీ నగర్ నుంచి పాలగడ్డ వరకు గత రెండేళ్లుగా నిలిచిపోయిన రహదారి నిర్మాణ జాప్యంపై అధికారులను నిలదీస్తామని హామీ ఇచ్చారు.అంబులెన్స్ సమస్యలపై సంబంధిత అధికారులతో మాట్లాడతామని, ఆసుపత్రుల్లో వైద్యులు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. సీలేరు ఆసుపత్రిని సీహెచ్‌సీగా మార్చేందుకు ఇప్పటికే లేఖ రాశామని తెలిపారు.చిన్న గంగవరం వంతెన నిర్మాణం, స్థానికులకు ఉద్యోగ అవకాశాలు, గృహ నిర్మాణాల్లో జెన్‌కో అడ్డంకులు వంటి అంశాలపై జేసీ సానుకూలంగా స్పందించి, తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో తహసీల్దార్ అన్నాజీరావు, సీలేరు సెక్రటరీ పరశురాం పాల్గొన్నారు.
ఓటర్ల సర్వే ప్రక్రియ వేగవంతం
చింతపల్లి: జిల్లాలోని అన్ని గ్రామాల్లో ఓటర్ల నమోదు, సర్వే కార్యక్రమాన్ని వేగవంతంగా పూర్తి చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీపూజ తిరుమణి అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆమె చింతపల్లి మండలంలోని పలు గ్రామాల్లో పర్యటించి, ఓటర్ల నమోదు ప్రక్రియను స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ.. ఓటరు జాబితాలో చేర్పులు, మార్పులు, తప్పుల సవరణలు మరియు కొత్త ఓటర్ల నమోదు ప్రక్రియను పక్కాగా నిర్వహించాలని సూచించారు. ఎన్నికల నిబంధనల ప్రకారం జిల్లాలో అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించడమే లక్ష్యంగా సిబ్బంది పని చేయాలన్నారు. అనర్హులను తొలగించి, అర్హులను చేర్పించే క్రమంలో ఎవరైనా నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.ప్రతి మండలానికి చెందిన సిబ్బంది తమ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తూ, నిర్దేశిత గడువులోపు ఈ కార్యక్రమాన్ని వంద శాతం పూర్తి చేయాలని ఆమె ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో సీతామహాలక్ష్మి, తహసీల్దారు త్రివేణి, బీఎల్వోలు తదితరులు పాల్గొన్నారు.


