● అధికారులకు కలెక్టర్ నిశాంతి ఆదేశం
● 117 వినతుల స్వీకరణ
పాడేరు: ప్రతి శుక్రవారం ఐటీడీఏలో నిర్వహించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్) కార్యక్రమానికి అన్ని శాఖల జిల్లా అధికారులు తప్పనిసరిగా హాజరు కావాలని జిల్లా కలెక్టర్ టి.నిశాంతి ఆదేశించారు. ఐటీడీఏ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఐటీడీఏ పీవో ఆదిత్యవర్మ, ఇన్‌చార్జి డీఆర్వో లోకేశ్వరరావు, పాడేరు ఆర్డీవో భుజంగరావులతో కలిసి వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అర్జీదారుల నుంచి 117 వినతులను ఆమె స్వీకరించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ, అర్జీదారుల నుండి వచ్చే అత్యవసర ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. బుధవారం మండల స్థాయిలో, శుక్రవారం జిల్లా స్థాయిలో నిర్వహించే ిపీజీఆర్‌ఎస్ కార్యక్రమాలకు అధికారులు సమగ్ర సమాచారంతో హాజరుకావాలని, ఒకవేళ హాజరు కాలేని పక్షంలో ముందస్తుగా అనుమతి తీసుకోవాలని సూచించారు. అలాగే, అర్జీదారులు మీ కోసం కాల్ సెంటర్ నంబర్ 1100 సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమం అనంతరం, ప్రతి శుక్రవారం అర్జీదారులకు ఏర్పాటు చేసే ఉచిత భోజన కార్యక్రమంలో భాగంగా కలెక్టర్ నిశాంతి స్వయంగా ఫిర్యాదుదారులకు భోజనాన్ని వడ్డించారు. ఈ కార్యక్రమంలో టీడబ్ల్యూ డీడీ పరిమళ, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి నందు, డ్వామా పీడీ విద్యాసాగర్‌రావు, డీఆర్డీఏ పీడీ మురళి, ఎల్‌డీఎం మాతునాయుడు తదితర శాఖల జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.


