మన్యం వీరుడు.. పాండ్రంగి చిట్టిబాబు! | - | Sakshi
Sakshi News home page

మన్యం వీరుడు.. పాండ్రంగి చిట్టిబాబు!

Jul 4 2026 2:19 AM | Updated on Jul 4 2026 2:19 AM

పద్మనాభం: పద్మనాభం మండలం పాండ్రంగిలో పుట్టిన అల్లూరి సీతారామరాజు కాలక్రమంలో తెల్లదొరలకు సింహస్వప్నంగా మారిన విప్లవ వీరుడిగా ఎదిగారు. గిరిజనుల బాధను తన బాధగా భావించి, స్వాతంత్య్రం కోసం తుపాకీని చేతబట్టారు. బ్రిటిష్‌ సామ్రాజ్యాన్ని సవాల్‌ చేసిన మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు అడుగుజాడలు ఇప్పటికీ పాండ్రంగి నేలపై సజీవంగా నిలిచాయి. ప్రతి ఏటా మాదిరిగానే శనివారం ఆయన జయంతి సందర్భంగా అల్లూరి జన్మస్థలం పాండ్రంగి దేశభక్తి నినాదాలతో మార్మోగనుంది.

చిట్టిబాబు నుంచి మన్యం వీరుడిగా..

1897 జూలై 4న పాండ్రంగిలోని తన తాతగారింట వెంకటరామరాజు, సూర్యనారాయణమ్మ దంపతులకు శ్రీరామరాజుగా జన్మించారు. అల్లూరిని చిన్ననాటి నుంచి ‘చిట్టిబాబు’గా పిలిచేవారు. బాల్యం పశ్చిమగోదావరి జిల్లా మొగల్లులో గడిచింది. నాలుగేళ్ల వయసు వరకు అక్కడే పెరిగారు. అయినప్పటికీ.. జన్మస్థలమైన పాండ్రంగి ఆయన జీవితానికి చిరునామాగా నిలిచింది. చిన్ననాటి నుంచే ఆధ్యాత్మికత, దేశభక్తి, అన్యాయాన్ని ఎదిరించే తత్వం అలవర్చుకున్న ఆయన.. గిరిజనులపై బ్రిటిష్‌ పాలకుల దౌర్జన్యాన్ని చూసి సాయుధ పోరాటమే మార్గమని నిర్ణయించుకున్నారు. మన్యం ప్రాంతంలో గిరిజనులను ఏకం చేసి గెరిల్లా పోరాటానికి శ్రీకారం చుట్టిన అల్లూరి.. చింతపల్లి, కృష్ణదేవిపేట, రాజవొమ్మంగి పోలీస్‌ స్టేషన్లపై వరుస దాడులతో బ్రిటిష్‌ పాలకులను వణికించారు. చివరకు 1924 మే 7న బ్రిటిష్‌ సైన్యానికి చిక్కి వీరమరణం పొందినా, ఆయన త్యాగం భారత స్వాతంత్య్ర పోరాట చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయింది.

పాండ్రంగిలో చిరస్థాయిగా జ్ఞాపకాలు

అల్లూరి జన్మించిన ఇంటిని స్మారకంగా అభివృద్ధి చేశారు. గ్రామంలో ఆయన విగ్రహం, జన్మగృహంలోని ప్రత్యేక ప్రదర్శనలు, అల్లూరి సామాజిక వేదిక సందర్శకులను ఆకట్టుకుంటున్నాయి. జయంతి, వర్ధంతి వేళ రాష్ట్రం నలుమూలల నుంచి ప్రజలు ఇక్కడికి చేరుకుని నివాళులర్పించడం ఆనవాయితీగా మారింది.

జయంతికి సర్వం సిద్ధం

మన్యం వీరుడి జయంతి సందర్భంగా పాండ్రంగిలో వేడుకల నిర్వహణకు అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. జన్మగృహం, విగ్రహం వద్ద పుష్పాంజలి, నివాళి కార్యక్రమాలతో పాటు సాయంత్రం జయంతి సభ నిర్వహించనున్నారు. భరతమాత జాతర కూడా జరగనుండడంతో పాండ్రంగి గ్రామం పండుగ వాతావరణాన్ని సంతరించుకుంది.

అల్లూరి ఉగ్గుతాగిన ఊరు పద్మనాభం

ఇక్కడే జన్మించి.. తెల్లదొరల గుండెల్లో మరఫిరంగిలా మారి..

పాండ్రంగి కన్న విప్లవసింహం

జయంతి నేడు

ఇప్పటికీ చెక్కుచెదరని జ్ఞాపకాలు.. మన్యంవీరుడికి నీరాజనాలు..

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement