ముంచంగిపుట్టు: ఏపీఈఏపీసెట్–2026 ఫలితాల్లో మండలానికి చెందిన గిరిజన విద్యార్థిని గంపరాయి సంజన అద్భుత ప్రతిభ కనబరిచింది. జర్రెల పంచాయతీ దాశరిపుట్టు గ్రామానికి చెందిన ఉపాధ్యాయులు గంపరాయి కృష్ణమూర్తి, బేబిరాణిల కుమార్తె సంజన, ఈ పరీక్షలో 2204వ ర్యాంకు సాధించింది. గిరిజన విద్యార్థిని మంచి ర్యాంకు సాధించడంతో గ్రామస్తులు, మండల వాసులు హర్షం వ్యక్తం చేస్తూ ఆమెకు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా సంజన మాట్లాడుతూ.. చిన్నప్పటి నుంచి డాక్టర్ కావాలన్నది నా లక్ష్యం. ఆ కలను సాకారం చేసుకు నేందుకు రేయింబవళ్లు శ్రమించాను. భవిష్యత్తులో వైద్యురాలిగా మారి, వెనుకబడిన గిరిజన ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనేదే నా సంకల్పం. నీట్ ఫలితాల్లో కూడా అత్యుత్తమ ర్యాంకు సాధించి, మంచి వైద్య కళాశాలలో సీటు సంపాదిస్తానన్న నమ్మకం ఉంది అని ధీమా వ్యక్తం చేసింది.


