చింతపల్లి: ఎటువంటి ప్రత్యేక శిక్షణ లేకుండానే స్వయంకృషితో అగ్నివీర్‌గా ఎంపికై న కృష్ణవంశీ, గిరిజన యువతకు స్ఫూర్తిదాయకమని చింతపల్లి ఏఎస్పీ నవజ్యోతి మిశ్రా కొనియాడారు. గురువారం సాయంత్రం సబ్–డివిజనల్ పోలీస్ కార్యాలయంలో, అగ్నివీర్ శిక్షణ పూర్తి చేసుకుని ఉత్తరప్రదేశ్‌లో విధుల్లో చేరుతున్న పాంగి కృష్ణవంశీని ఏఎస్పీ ఘనంగా సత్కరించి, జ్ఞాపికను అందజేశారు. ఈ సందర్భంగా ఏఎస్పీ మాట్లాడుతూ.. కొయ్యూరు మండలం బంగారంపేట గ్రామానికి చెందిన కృష్ణవంశీ, నిరుపేద గిరిజన కుటుంబంలో జన్మించి ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో విద్యనభ్యసించి ఈ ఘనత సాధించడం అభినందనీయమని అన్నారు. 2025 డిసెంబర్‌లో జరిగిన అగ్నివీర్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి, ఆరు నెలల శిక్షణ తర్వాత మీరట్‌లో ఉద్యోగ బాధ్యతలు చేపట్టడం గిరిజన ప్రాంత యువతకు గర్వకారణమని పేర్కొన్నారు. కృష్ణవంశీ తండ్రి రాజుబాబు సాధారణ రైతు కాగా, తల్లి ఆశా కార్యకర్తగా పనిచేస్తూ తన కుమారుడిని ఉన్నత స్థానంలో చూడాలనుకున్న కల నిజమైందని అన్నారు. ఏఎస్పీ ఇంకా మాట్లాడుతూ.. మన ప్రాంత గిరిజన యువతీ యువకులకు నేవీ, ఆర్మీ, ఎయిర్‌ఫోర్స్, సీఆర్‌పీఎఫ్, సీఐఎస్‌ఎఫ్ వంటి కీలక విభాగాల్లో ఉద్యోగాలు సాధించే శక్తి సామర్థ్యాలు ఉన్నాయి. అయితే, సరైన శిక్షణ, అవగాహన లేకపోవడం వల్లనే చాలామంది అవకాశాలను కోల్పోతున్నారు. యువత కృష్ణవంశీని ఆదర్శంగా తీసుకుని దేశసేవ కోసం సైన్యంలో చేరేందుకు కృషి చేయాలి. రక్షణ దళాల్లో చేరాలనుకునే నిరుద్యోగ యువత స్థానిక పోలీస్ స్టేషన్లలో సంప్రదిస్తే, వారికి ఉద్యోగ అవకాశాలపై తగిన సలహాలు, సూచనలు అందజేస్తాం అని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో చింతపల్లి, కొయ్యూరు సీఐలు సింహాచలం, శ్రీనివాసరావు, ఎస్‌ఐ వీరబాబు తదితరులు పాల్గొన్నారు.
చింతపల్లి ఏఎస్పీ నవజ్యోతి మిశ్రా


