అరకు ఎంపీ తనూజరాణి
సాక్షి,పాడేరు: గిరిజన విద్యార్థులు పట్టుదలతో చదివి ఉన్నత విద్య, ఉద్యోగ అవకాశాలను సాధించాలని అరకు ఎంపీ డాక్టర్ గుమ్మా తనూజరాణి పిలుపునిచ్చారు. విజయనగరం కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం ప్రథమ స్నాతకోత్సవంలో, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా బంగారు పతకం అందుకున్న హుకుంపేట మండలం అడ్డుమండ గ్రామానికి చెందిన ఎమ్మెస్సీ కెమిస్ట్రీ విద్యార్థిని రేగం నీలిమను గురువారం పాడేరులోని ఎంపీ క్యాంపు కార్యాలయంలో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా విద్యార్థిని రేగం నీలిమతో పాటు, ఇంటర్‌లో 982 మార్కులు సాధించిన బాకూరు గౌతమ్ శివరామకృష్ణ, పదో తరగతిలో 542 మార్కులు సాధించిన సమరెడ్డి శివకేశవనాయుడులను ఎంపీ సన్మానించి, బహుమతులు అందజేశారు.
ప్రతిభావంతులకు ఎంపీ అభినందనలు
ఈ సందర్భంగా ఎంపీ తనూజరాణి మాట్లాడుతూ, గిరిజన విద్యార్థులు పదో తరగతి, ఇంటర్మీడియట్‌కే పరిమితం కాకుండా ఉన్నత విద్యలో రాణించాలని సూచించారు. గిరిజన యువతీ యువకులు ఉన్నత శిఖరాలను అధిరోహించడం వల్ల వారి కుటుంబాల్లోని పేదరికం తొలగిపోవడమే కాకుండా, గిరిజన సమాజం అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. సాధారణ గిరిజన కుటుంబానికి చెందిన రేగం నీలిమ కేంద్రీయ విశ్వవిద్యాలయం స్థాయిలో బంగారు పతకం సాధించడం మన్యం ప్రాంతానికే గర్వకారణమని ఆమె కొనియాడారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నేత చెట్టి వినయ్, అడ్డుమండ మాజీ సర్పంచ్ గుమ్మా శ్యాంసుందర్, న్యాయవాది బాకూరు కరుణాకర్, వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగి కంబిడి సుబ్రహ్మణ్యం, అడ్డుమండ గ్రామ పెద్దలు మజ్జి కై లాసం, సంపంగిబోయిన రామన్న, ఏడెలి రామ్‌ప్రసాద్, జంపరంగి వనజ తదితరులు పాల్గొన్నారు.


