పాడేరు రూరల్: ఉపాధి హామీ పథకం పేరు మార్పుతో దానిని నిర్వీర్యం చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కుట్ర పన్నుతున్నాయని పీసా కమిటీ డివిజన్ అధ్యక్షుడు పాలికి లక్కు ఆరోపించారు. గురువారం మండలంలోని గురగరువు గ్రామంలో ఉపాధి కూలీలతో ఆయన సమావేశమై, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పాలికి లక్కు మాట్లాడుతూ.. భవిష్యత్తులో ఈ పథకాన్ని పూర్తిగా రద్దు చేసేందుకే ప్రభుత్వం పేర్లు మార్పు చేస్తోందని విమర్శించారు. గత ప్రభుత్వాలు పేద ప్రజల కోసం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఈ పథకాన్ని, ప్రస్తుత కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం నిర్వీర్యం చేసేందుకు ప్రయత్నిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. పథకం పేరు మార్చడం ద్వారా పని దినాలను తగ్గించడమే కాకుండా, ఉన్న ఉపాధిని కూడా లేకుండా చేసే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు. పథకాన్ని నీరుగార్చే కుట్రలను ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలని, ప్రస్తుతం ఉన్న 150 పని దినాలను ఎటువంటి షరతులు లేకుండా పెంచాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రత్యేక హాజరు విధానాన్ని రద్దు చేయాలని, రోజువారీ కూలీని రూ. 600కు పెంచి చెల్లించాలని కోరారు. ఇప్పటికే ఈ పథకానికి కేటాయించే నిధులను 90 శాతం నుంచి 60 శాతానికి కుదించి, కూలీల పొట్టగొడుతున్నారని ఆరోపించారు. ఆదివాసీ ఉపాధి కూలీలపై చిత్తశుద్ధి ఉంటే, పాత పద్ధతిలోనే ఉపాధి హామీ పథకాన్ని నిరంతరాయంగా కొనసాగించాలని పాలికి లక్కు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కూలీలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
పీసా కమిటీ డివిజన్ అధ్యక్షుడు పాలికి లక్కు


