పెదబయలు: సమగ్ర శిక్షా అభియాన్ పథకం ద్వారా చేపడుతున్న పాఠశాల భవన నిర్మాణ పనులను వేగవంతం చేయాలని సమగ్ర శిక్షా అడిషనల్ ప్రాజెక్టు కోఆర్డినేటర్ డాక్టర్ స్వామి నాయుడు ఆదేశించారు. గురువారం ఆయన పెదబయలు మండలంలోని మారుమూల ప్రాంతాలైన జామిగుడ, జీలుగులపుట్టు ప్రాథమిక పాఠశాలలను సందర్శించి, అక్కడ ఉన్న మౌలిక సదుపాయాలు మరియు విద్యార్థుల విద్యా ప్రమాణాలను పరిశీలించారు. అనంతరం పెదబయలు గిరిజన సంక్షేమ ఆశ్రమ బాలికల పాఠశాల–2లో నిర్మాణంలో ఉన్న ’పీఎం జన్మన్’ హాస్టల్ పనులను ఆయన తనిఖీ చేశారు. పనులను వేగవంతం చేయాలని సంబంధిత ఇంజనీర్లతో ఫోన్‌లో మాట్లాడి సూచనలు జారీ చేశారు. ఆ తర్వాత, సర్వేపల్లి రాధాకృష్ణన్ ’విద్యార్థి మిత్ర’ కిట్ల పంపిణీ వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఎస్‌ఆర్‌కేవీఎం యాప్‌లో విద్యార్థులకు అందించిన కిట్ల వివరాలను తప్పనిసరిగా నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖాధికారి కొమ్ము కృష్ణమూర్తి, సమగ్ర శిక్షా సిబ్బంది సీఎంఓ ప్రకాష్, ఏపీవో ఎంఎస్‌ఎల్ పాత్రుడు, కూర్మారావు, సీఆర్పీలు పాల్గొన్నారు.
ఏపీసీ డాక్టర్ స్వామి నాయుడు ఆదేశం


