కలెక్టర్ నిశాంతి
సాక్షి, పాడేరు: మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం స్థానంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వికసిత్ భారత్ గ్యారెంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ ఆజీవికా మిషన్ గ్రామీణ్ పథకాన్ని కలెక్టర్ టి.నిశాంతి గురువారం చింతలవీధిలో ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఈ కొత్త పథకం ద్వారా ఉపాధి పనిదినాలను 100 నుంచి 125 రోజులకు పెంచడం జరిగిందని తెలిపారు. అలాగే, రోజువారీ కూలిని రూ. 312కు పెంచడం వల్ల కూలీలకు ఆర్థికంగా ఎంతో మేలు జరుగుతుందని ఆమె పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో సమగ్ర ఆర్థికాభివృద్ధిని, జీవనోపాధి భద్రతను మరింత బలోపేతం చేసే లక్ష్యంతోనే కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని తీసుకొచ్చిందని ఆమె వివరించారు. అంతకుముందు కలెక్టరేట్‌లో ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రచార పోస్టర్‌ను కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ పథకం ప్రారంభోత్సవానికి సంబంధించి కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పాల్గొన్న ప్రత్యక్ష ప్రసారాన్ని అధికారులు వీక్షించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.


