నిత్య పోరాటం | - | Sakshi
Sakshi News home page

నిత్య పోరాటం

Jul 2 2026 2:35 AM | Updated on Jul 2 2026 2:35 AM

● అగ్గిపెట్టె కావాలన్నాకొండలెక్కి దిగాల్సిందే ● దయనీయస్థితిలో గుమ్మరేవులపంచాయతీలోని గ్రామాలు ● రోడ్డు సౌకర్యం లేక నరకయాతన ● అధికారంలోకి వచ్చి రెండేళ్లు అవుతున్నా పట్టించుకోని పాలకులు

స్వాతంత్రం వచ్చి 76 ఏళ్లు గడుస్తున్నా, టెక్నాలజీతో అంతరిక్షంలోకి దూసుకుపోతున్నా, జిల్లాలోని మారుమూల గిరిజన ప్రాంతాల్లో మాత్రం జీవన పరిస్థితులు మారలేదు. నేటికీ కనీస మౌలిక సదుపాయాలు లేక గిరిజనులు పడుతున్న కష్టాలు అన్నీ ఇన్నీ కావు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లవుతున్నా తమ ప్రాంతం అభివృద్ధికి ఆమడ దూరంలోనే ఉందని గుమ్మరేవులు పంచాయతీ పరిధిలోని 30 గ్రామాల గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

సీలేరు: గూడెం కొత్తవీధి మండలం, గుమ్మరేవులు పంచాయతీ పరిధిలోని సుమారు 30 గ్రామాల పరిస్థితి అత్యంత దయనీయంగా ఉంది. అగ్గిపెట్టి కొనాలన్నా, అంగన్‌వాడీ కేంద్రం నుంచి గుడ్లు తెచ్చుకోవాలన్నా, పాఠశాలకు వెళ్లాలన్నా కిలోమీటర్ల కొద్దీ కొండలు ఎక్కాల్సిందే. ఒడిశా, పోలవరం సరిహద్దుల్లో ఉన్న పులుసు మామిడి, పెంటకోట, శనగనూరు, దొరగొంది, పరమశింగవరం వంటి గ్రామాలకు రోడ్డు మార్గం లేదు. సుమారు 13 కిలోమీటర్ల ప్రయాణంలో నాలుగు కిలోమీటర్లు మాత్రమే మెటల్‌ రోడ్డు ఉండగా, మిగిలిన దూరం కొండ కోనల గుండా ప్రమాదకర ప్రయాణం చేయాల్సిందేనని స్థానికులు వాపోతున్నారు.

● ఒకప్పుడు మావోయిస్టుల ప్రభావిత ప్రాంతంగా, గంజాయికి కేరాఫ్‌ అడ్రస్‌గా ఉన్న ఈ గ్రామాల్లో, గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో భారీ మార్పులు వచ్చాయి. రోడ్ల నిర్మాణం, సచివాలయ భవనాలు, విలేజ్‌ క్లినిక్‌లు, రైతు భరోసా కేంద్రాలు, సెల్‌ టవర్ల ఏర్పాటుతో మారుమూల గిరిజన గ్రామాల్లో వసతులు మెరుగుపడ్డాయి. దశాబ్దాలుగా చూడని అభివృద్ధిని అప్పట్లో జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం చేసి చూపిందని గిరిజనులు గుర్తు చేసుకుంటున్నారు.

నేడు మళ్లీ మొదటికి..

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ అభివృద్ధిని గాలికి వదిలేశారని గిరిజనులు ఆరోపిస్తున్నారు. గత రెండేళ్లుగా కొత్త పనులు చేపట్టకపోగా, ఉన్న రోడ్లు, భవనాల నిర్వహణ కూడా కరువైందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల సమయంలో ఓట్ల కోసం వచ్చే నాయకులు, గెలిచిన తర్వాత తమ కష్టాలను పట్టించుకోవడం లేదని మండిపడుతున్నారు.

● విద్య, వైద్యం, సాగునీరు, కరెంటు.. ఇలా ఏ ఒక్క సౌకర్యం లేక అల్లాడుతున్న తమను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని, యుద్ధ ప్రాతిపదికన మౌలిక వసతులు కల్పించాలని గిరిజన ప్రజలు కోరుతున్నారు. లేని పక్షంలో తమ నిరసనను ఉధృతం చేస్తామని వారు హెచ్చరిస్తున్నారు.

అభివృద్ధి అంటే తెలియదు

మేము 30 ఏళ్లు గా ఇక్కడే ఉంటు న్నాం. పంచాయతీ కేంద్రానికి వెళ్లే 13 కిలోమీటర్ల మార్గంలో నా లుగు కిలోమీటర్లు రోడ్డు లేక కొండల మీదుగా కాలినడకన ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని వెళ్తున్నాం. అభివృద్ధి అంటే ఏంటో మాకు తెలియడం లేదు, అత్యవసరమైతే ఆసుపత్రికి వెళ్లే దారి కూడా లేదు. ప్రభుత్వం తక్షణమే స్పందించి రోడ్డు నిర్మించాలి.

– పాంగి ఆనందరావు, పాంగి గోపాల్‌, గుమ్మరేవులు పంచాయతీ

ప్రభుత్వం కళ్లు తెరవాలి

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తవుతున్నా, మారుమూల ప్రాంతాల్లో ఏ ఒక్క అభివృద్ధి జరగలేదు. కోట్ల రూపాయల నిధులు ఆరోగ్య శాఖకు వెళ్తున్నా, సరైన రోడ్లు లేక అంబులెన్స్‌ కూడా రాక గిరిజనులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఆసుపత్రులు, పాఠశాలలు, వంతెనలు లేక మా బతుకులు దుర్భరంగా మారాయి. ప్రభుత్వం కళ్లు తెరవాలి.

– పాంగి నాగేశ్వరరావు,

అధ్యక్షుడు, ఏపీజీఎస్‌

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement