గిరిజన బిడ్డల ఆరోగ్యమే ధ్యేయం | - | Sakshi
Sakshi News home page

గిరిజన బిడ్డల ఆరోగ్యమే ధ్యేయం

Jul 2 2026 2:23 AM | Updated on Jul 2 2026 2:23 AM

సికిల్‌సెల్‌ అనీమియాపై

డాక్టర్‌ కె. కరుణ సమగ్ర పరిశోధన

జాతీయ వైద్యుల దినోత్సవం

సందర్భంగా వివరాలు వెల్లడి

డుంబ్రిగుడ: గిరిజన ప్రాంతాల్లో తరం మారుతున్నా, వారిని వెంటాడుతున్న ఒక ప్రధాన ఆరోగ్య సమస్య సికిల్‌ సెల్‌ అనీమియా. ఈ వ్యాధిపై గిరిజన యువతలో ఉన్న అజ్ఞానాన్ని పోగొట్టి, వారి ఆరోగ్య సంరక్షణే లక్ష్యంగా కమ్యూనిటీ మెడిసిన్‌ పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ వైద్యురాలు డాక్టర్‌ కమ్మిడి కరుణ చేసిన పరిశోధన ఇప్పుడు చర్చనీయాంశమైంది. జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా ఆమె తన పరిశోధనా విశేషాలను వెల్లడించారు.

11 ఏళ్ల సేవ.. పరిశోధనకు పునాది..

రంగరాయ మెడికల్‌ కాలేజీ పూర్వ విద్యార్థిని అయిన డాక్టర్‌ కరుణ, వైద్య వృత్తిని కేవలం ఉద్యోగంగా చూడలేదు. పాడేరు ఏరియా ఆసుపత్రిలో ఐదేళ్లు, కిల్లోగూడ పీహెచ్‌సీలో 6 ఏళ్లు.. మొత్తం 11 ఏళ్ల పాటు మారుమూల గిరిజన ప్రాంతాల్లో ఆమె సేవలందించారు. గిరిజన ప్రజలు సికిల్‌ సెల్‌ ఎనీమియాతో పడుతున్న ఇబ్బందులను, అవగాహనా లోపాన్ని దగ్గరగా చూసిన ఆమె, ఈ సమస్యకు మూలాల్లోకి వెళ్లి పరిష్కారం కనుగొనాలనే పట్టుదలతో 2023లో కమ్యూనిటీ మెడిసిన్‌లో పీజీని ఎంచుకున్నారు.

వెయ్యి మంది విద్యార్థులపై అధ్యయనం

తన పరిశోధనలో భాగంగా గిరిజన ప్రాంతానికి చెందిన 4 ప్రముఖ విద్యాసంస్థల్లోని వెయ్యి మంది విద్యార్థులపై డాక్టర్‌ కరుణ విస్తృత అధ్యయనం నిర్వహించారు. ఈ సర్వేలో తేలిన గణాంకాలు దిగ్భ్రాంతిని కలిగిస్తున్నాయి. 93 శాతం మంది విద్యార్థులకు సికిల్‌ సెల్‌ అనీమియాపై కనీస అవగాహన లేదు. 6.9శాతం మంది విద్యార్థులు ఈ వ్యాధి వాహకాలుగా ఉన్నారు.1.7 శాతం మంది నేరుగా ఈ వ్యాధిగ్రస్తులుగా ఉన్నారని తేలింది.

వ్యాధి నిర్మూలనకు ’పంచసూత్రాల’ ప్రణాళిక

ఈ ఫలితాల ఆధారంగా గిరిజన ప్రాంతాల్లో సికిల్‌ సెల్‌ నిర్మూలనకు డాక్టర్‌ కరుణ ఐదు కీలక సూచనలు చేశారు. బాల్యం నుంచి కౌమారదశ, వివాహం వరకు ప్రతి దశలోనూ స్క్రీనింగ్‌ పరీక్షలు తప్పనిసరి చేయాలని కరుణ సూచించారు.వైద్యశాఖతో పాటు విద్యా, గిరిజన సంక్షేమ శాఖలు కలిసి పనిచేయాలి. పాఠ్యప్రణాళికల్లో అవగాహన అంశాలను చేర్చాలని కోరారు. వ్యాధి గుర్తింపు నుంచి చికిత్స, పునరావాసం, కౌన్సెలింగ్‌ వరకు అన్నీ ఒకే చోట అందేలా చూడాల్సిన అవసరం ఉందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ‘జాతీయ సికిల్‌ సెల్‌అనీమియా నిర్మూలన మిషన్‌’ను చివరి లబ్ధిదారుడి వరకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. ఆశా కార్యకర్తలు, గిరిజన పెద్దలు, యువతను భాగస్వాములను చేస్తూ దీనిని ఒక ప్రజా ఉద్యమంగా మార్చాలని ఆమె సూచించారు.

సికిల్‌ సెల్‌ స్క్రీనింగ్‌ పరీక్షలు తప్పనిసరి

పెళ్లిళ్లకు ముందు, గర్భధారణ సమయంలో సికిల్‌ సెల్‌ స్క్రీనింగ్‌ పరీక్షలు చేసుకుంటే, రాబోయే తరాలకు ఈ వంశపారంపర్య వ్యాధి సోకకుండా అడ్డుకోవచ్చు. గిరిజన సమాజ ఆరోగ్య హక్కును కాపాడటానికి తన వంతు కృషిని నిరంతరం కొనసాగిస్తా.

– డాక్టర్‌ కమ్మిడి కరుణ,

సికిల్‌సెల్‌ అనీమియా అధ్యయన వైద్యురాలు

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement