సీలేరు: గూడెం కొత్తవీధి మండలం దారకొండ గ్రామంలో తొమ్మిదేళ్ల గిరిజన బాలికపై అమానుషంగా చిత్రహింసలకు పాల్పడిన ఘటన తీవ్ర కలకలం రేపింది. సదరు బాలిక చేతులపై అట్లకాడతో వాతలు పెట్టిన ఘటనపై వచ్చిన ఫిర్యాదు మేరకు, బుధవారం చింతపల్లి ఏఎస్పీ నవజ్యోతి మిత్ర దారకొండ గ్రామాన్ని సందర్శించారు. గ్రామ పెద్దల సమక్షంలో ఘటనపై పూర్తిస్థాయిలో విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా ఏఎస్పీ వివరాలు సేకరించిన ఆయన బాలికను చిత్రహింసలకు గురిచేసిన ప్రదేశాన్ని పరిశీలించారు. అనంతరం బాధిత బాలికతో మాట్లాడి వివరాలు సేకరించారు. గ్రామంలోని పెద్దల నుంచి వాంగ్మూలం నమోదు చేశారు. ఇప్పటికే ఈ దారుణానికి పాల్పడిన చర్చి పాస్టర్, ఆయన భార్య, ఇంటి పక్కనే ఉన్న మరో మహిళపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి, ఆధారాలను సేకరించినట్లు పోలీసులు తెలిపారు.
మళ్లీ ఇలాంటివి జరగకూడదు : ఈ సందర్భంగా ఏఎస్పీ మాట్లాడుతూ, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. మైనర్ పిల్లలను కూలి పనులకు వాడుకోవడం చట్టరీత్యా నేరమని, ఎవరూ ఇలాంటి పనులకు వారిని ప్రోత్సహించవద్దని హెచ్చరించారు. బాలికను రెండు రోజుల్లో ఐసీడీఎస్ అధికారులకు అప్పగిస్తామని, ఆమెకు మెరుగైన విద్య, ఆరోగ్యం అందేలా బాధ్యత తీసుకుంటామని తెలిపారు.
గంజాయి, మత్తు పదార్థాలకు
దూరంగా ఉండండి
డబ్బుకు ఆశపడి గిరిజనులు ఎవరూ గంజాయి రవాణా, పెంపకం వంటి చట్ట వ్యతిరేక పనులకు పాల్పడవద్దని ఏఎస్పీ కోరారు. ఒడిశా నుంచి ఆంధ్రా మీదుగా ఇతర రాష్ట్రాలకు సాగుతున్న గంజాయి రవాణాను అడ్డుకుంటున్నామని, ఇందులో గిరిజనులు భాగస్వాములు కావద్దని సూచించారు. చింతపల్లి సబ్–డివిజన్ పరిధిలో రోడ్డు భద్రతా నియమాలు తప్పనిసరిగా పాటించాలని ఆయన కోరారు. ఎన్‌హెచ్5 రోడ్డు నిర్మాణం తర్వాత ప్రమాదాలు పెరిగి ప్రాణనష్టం జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. వాహనదారులు సీటు బెల్టు, హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని, మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అనంతరం సీలేరు పోలీస్ స్టేషన్‌ను సందర్శించి భద్రతపై సూచనలు చేశారు. నూతనంగా నిర్మిస్తున్న పోలీస్ స్టేషన్ భవనాలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో గూడెంకొత్తవీధి సీఐ సుధాకర్, ఎస్‌ఐ యాసిన్ తదితరులు పాల్గొన్నారు.
వివరాలు సేకరించిన ఏఎస్పీ నవజ్యోతి మిశ్రా


