అరకులోయ టౌన్: ఇన్–సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ నిబంధన నుంచి మినహాయింపు లభించేలా విద్యా హక్కు చట్టాన్ని సవరించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ, ఈ విషయమై రాష్ట్ర ప్రభుత్వానికి తగిన సిఫార్సు చేయాలని స్థానిక ఎమ్మెల్యే రేగం మత్స్యలింగానికి ఫ్యాప్టో జిల్లా చైర్మన్ రావుల జగన్‌మోహన్‌రావు వినతిపత్రం అందజేశారు. మంగళవారం స్థానిక ఎమ్మెల్యేను ఆయన నివాసంలో ఉపాధ్యాయ సంఘాల నాయకులు కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సర్వీసులో ఉన్న ఉపాధ్యాయులకు టెట్ నిబంధనను రద్దు చేయాలని, లేదా వారికి ప్రత్యేకంగా టెట్ నిర్వహించాలని కోరారు. అలా కాని పక్షంలో ఉపాధ్యాయులు తీవ్ర మానసిక ఆందోళనకు గురయ్యే ప్రమాదం ఉందని, తద్వారా పాఠశాలల్లో విద్యాబోధన కుంటుపడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. కాబట్టి ప్రభుత్వం ఈ విషయంపై తక్షణమే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఫ్యాప్టో సెక్రటరీ జనరల్ పలాసి కర్రన్న, ఏపీటీఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు శ్యామ్‌సుందర్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ధనుర్జయ్, జిల్లా అధ్యక్షుడు రఘునాథ్, బీటీఏ జిల్లా అధ్యక్షుడు సలీం, ఇతర ఉపాధ్యాయ నాయకులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే రేగం మత్స్యలింగానికి
ఫ్యాప్టో నాయకుల వినతి


