కొండపై సిగ్నల్‌! | - | Sakshi
Sakshi News home page

కొండపై సిగ్నల్‌!

Jul 1 2026 1:46 AM | Updated on Jul 1 2026 1:46 AM

అడవిలో టవర్లు..

అలంకారప్రాయంగా మారిన టవర్లు

గిరిజనుల అవస్థలు వర్ణణాతీతం

అధికారులకు విన్నవించినా

చర్యలు శూన్యం

సాక్షి, పాడేరు: గిరిజన ప్రాంతాల్లోని మారుమూల గ్రామాలకు 4జీ, 5జీ సేవలు అందించే లక్ష్యంతో గత వైఎస్సార్‌సీపీ ప్రభు త్వం రూ.వేల కోట్లతో సెల్‌ టవర్ల నిర్మాణా నికి శ్రీకారం చుట్టింది. అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హయాంలో పాడేరు జోన్‌లో 416, అరకులోయ జోన్‌లో 354 టవర్ల నిర్మాణా నికి చర్యలు చేపట్టగా, పనులు చురుగ్గా సాగాయి. అయితే, ప్రస్తుత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పనుల్లో జాప్యం నెలకొంది. చాలా చోట్ల టవర్ల నిర్మాణం పూర్తయినప్పటికీ, సిగ్నల్‌ వ్యవస్థ లేకపోవడంతో అవి కేవలం అలంకారప్రాయంగానే మిగిలిపోయాయి.

సౌకర్యం లేక ఇబ్బందులు

అరకులోయ జోన్‌ పరిధిలోని ముంచంగిపుట్టు, డుంబ్రిగుడ, అనంతగిరి మండలాల్లోని మారుమూల ప్రాంతాల్లో నిర్మించిన 12 బీఎస్‌ఎన్‌ఎల్‌ టవర్లకు సిగ్నల్‌ వ్యవస్థను అందుబాటులోకి తేవడంలో అధికారులు తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నారు. దీనివల్ల గిరిజనులు కమ్యూనికేషన్‌ పరంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉపాధి హామీ పనులకు ‘ముఖ హాజరు’ తప్పనిసరి చేయడంతో, సిగ్నల్‌ కోసం గిరిజనులు ఎత్తయిన కొండలు ఎక్కాల్సిన దుస్థితి ఏర్పడింది.

అధికారుల నిర్లక్ష్యంపై ఆగ్రహం

డుంబ్రిగుడ మండలం సొవ్వ పంచాయతీలోని కమలబంద, కరకవలస, చమండపాడు, కిరిడివలస, గసబ పంచాయతీలోని మొర్రిగుడ, సువ్వగుడ, గొందివలస; సాగర పంచాయతీలోని టిక్కిలిబెడ్డ, పనసబంద తదితర గ్రామాల గిరిజనులు, తమ ప్రాంతాల్లోని టవర్లకు సిగ్నల్‌ సౌకర్యం కల్పించాలని విశాఖలోని నెట్‌వర్క్‌ అధికారులకు పలుమార్లు విన్నవించుకున్నారు. వినతిపత్రాలు ఇవ్వడంతో పాటు ఆందోళనలు చేపట్టినా ఫలితం లేదని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విద్య, వైద్యం, ప్రభుత్వ పథకాలకు అవసరమైన సమాచారం కోసం కూడా తాము నరకయాతన పడుతున్నామని, అధికారులు వెంటనే స్పందించి టవర్లను వినియోగంలోకి తీసుకురావాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు.

వినతులిచ్చినా స్పందన కరువు

డుంబ్రిగుడ మండలంలోని సొవ్వా, సాగర, గసబ పంచాయతీల్లో గత రెండేళ్లుగా సెల్‌టవర్లు నిరుపయోగంగా ఉన్నాయి.సెల్‌ సంకేతాలు అందుబాటులోకి తెచ్చి మారుమూల గ్రామాల గిరిజనులకు మేలు చేయాలని అనేక సార్లు విశాఖలోని బీఎస్‌ఎన్‌ఎల్‌ అధికారులకు వినతిపత్రాలు అందజేశాం. అయినా పట్టించుకోవడం లేదు. సిగ్నల్‌ వ్యవస్థ లేని సెల్‌ టవర్లు గ్రామాల్లో అలంకార ప్రాయంగా మారాయి. అత్యవసర, ఉపాధి పనుల ముఖ హాజరుకు కొండెక్కాల్సి వస్తోంది.

– వంతాల గురునాయుడు, సామాజిక కార్యకర్త,

కమలబంద, డుంబ్రిగుడ మండలం

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement