165 కిలోల గంజాయి పట్టివేత | - | Sakshi
Sakshi News home page

165 కిలోల గంజాయి పట్టివేత

Jul 1 2026 1:46 AM | Updated on Jul 1 2026 1:46 AM

ఐదుగురి అరెస్టు

పెదబయలు: మండలంలోని రోగులపేట జంక్షన్‌ వద్ద మంగళవారం మధ్యాహ్నం చేపట్టిన వాహన తనిఖీల్లో భారీగా గంజాయి పట్టుబడింది. ఒడిశా నుంచి మైదాన ప్రాంతాలకు ఆటోలో తరలిస్తున్న 165 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు ఎస్‌ఐ టి. వెంకటేష్‌ తెలిపారు. వివరాల్లోకి వెళ్తే..ఒడిశా రాష్ట్రం, కోరాపుట్‌ జిల్లా ఘటీగుడ గ్రామానికి చెందిన నబిన్‌ కొర్ర, కాసు కొర్ర, సునీల్‌ సీందేరి, భీస్మ గెమ్మెలి, సాల్మాన్‌ గెమ్మెలి అనే ఐదుగురు వ్యక్తులు గంజాయిని కొనుగోలు చేశారు. దానిని జామిగుడ, రూడకోట, కుజభంగి జంక్షన్ల మీదుగా మైదాన ప్రాంతాలకు ఆటోలో తరలిస్తుండగా, రోగులపేట జంక్షన్‌ వద్ద పోలీసులకు పట్టుబడ్డారు. వారి నుంచి 165 కిలోల గంజాయితో పాటు ఆటో, ద్విచక్ర వాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసు కున్నారు. పట్టుబడిన గంజాయి విలువ సుమారు రూ. 82.50 లక్షలు ఉంటుందని ఎస్‌ఐ అంచనా వేశారు. నిందితులపై ఎన్డీపీఎస్‌ చట్టం కింద కేసు నమోదు చేసి, రిమాండ్‌కు తరలించినట్లు ఆయన వెల్లడించారు. ఈ తనిఖీల్లో పోలీసు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.

పెందుర్తిలో మూడు కిలోలు

పెందుర్తి: అరకు ఏజెన్సీ ప్రాంతం నుంచి పెందుర్తి మీదుగా విజయవాడకు గంజాయి తరలిస్తున్న ఓ వ్యక్తిని పెందుర్తి పోలీసులు మంగళవారం పట్టుకున్నారు. వివరాలివి.. విజయవాడకు చెందిన పార్వాడ కనక రవి కిరణ్‌(26) గంజాయి వ్యాపారం చేస్తుంటాడు. ఈ క్రమంలో అరకు ప్రాంతంలో 3 కిలోల గంజాయిని కొనుగోలు చేసి విజయవాడలో అమ్మకాలు జరిపేందుకు పెందుర్తి రైల్వే స్టేషన్‌ మీదుగా తరలిస్తున్నాడు. రైల్లో పెందుర్తి వచ్చిన నిందితుడు స్టేషన్‌ పరిసర ప్రాంతాల్లో అనుమానాస్పదంగా తిరుగాడుతుండడంతో అనుమానం వచ్చిన పోలీసులు వారిని పట్టుకున్నారు. సీఐ కె.వి.సతీష్‌కుమార్‌ ఆధ్వర్యంలో ఎస్‌ఐ ఎన్‌వీ భాస్కరరావు, పోలీసులు అతడి వద్ద ఉన్న గంజాయిని, ఒక సెల్‌ఫోన్‌ స్వాధీనం చేసుకుని, నిందితుడిని అరెస్ట్‌ చేశారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement