బడి తెరిచినా రాని బడిపంతులు | - | Sakshi
Sakshi News home page

బడి తెరిచినా రాని బడిపంతులు

Jul 1 2026 1:46 AM | Updated on Jul 1 2026 1:46 AM

సీలేరు: చదువు చెప్పేందుకు రండి సార్‌.. అంటూ గూడెం కొత్తవీధి మండలం ఆకులూరు ఎంపీపీ పాఠశాల విద్యార్థులు, వారి తల్లిదండ్రులు వేడుకుంటున్నారు. ప్రభుత్వం పాఠశాలలు తెరిచి నెల రోజులు కావస్తున్నా, తమ పాఠశాల తెరచుకోకపోవడం, ఉపాధ్యాయులు అటువైపు కన్నెత్తి చూడకపోవడంతో విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది.

అక్షర జ్ఞానానికి నోచుకోని విద్య

ఆకులూరు పాఠశాలలో సుమారు 23 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. జూన్‌ నెలలో పాఠశాలలు పునఃప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు ఉపాధ్యాయులు విధులకు హాజరుకాకపోవడంతో, ఆ చిన్నారులు పాఠాలకు దూరంగా ఉండిపోతున్నారు. ఈ విషయాన్ని గాలికొండ మాజీ సర్పంచ్‌ కాకూరి బుజ్జిబాబు విలేకరులకు తెలిపారు. ఉపాధ్యాయుల బాధ్యతారాహిత్యంపై ఆగ్రహం వ్యక్తం చేసిన తల్లిదండ్రులు, జిల్లా కలెక్టర్‌ మరియు ఐటీడీఏ అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

రేకుల షెడ్డులో భవిత

పాఠశాలకు కనీసం శాశ్వత భవనం కూడా లేకపోవడం మరో విషాదం. విద్యార్థులు రేకుల పాకలో చదువుకోవాల్సిన దుస్థితి నెలకొంది. వర్షాకాలంలో ఈ రేకుల షెడ్డులో విద్యార్థులు పడుతున్న ఇబ్బందులు వర్ణనాతీతం. పక్కా భవనం నిర్మించాలనే డిమాండ్‌ ఎప్పటి నుంచో ఉన్నా, అధికారులు స్పందించడం లేదని గ్రామస్తులు విచారం వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దాల్సిన ఉపాధ్యాయులు ఇలా గైర్హాజరు కావడం దారుణమని, ఇప్పటికై నా అధికారులు స్పందించి ఉపాధ్యాయులను నియమించాలని విద్యార్థులు పాఠశాల వద్ద నిరసన తెలిపారు.

ఆకులూరు పాఠశాల విద్యార్థులు,

తల్లిదండ్రులు ఆవేదన

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement