● నిరసనగా కలెక్టరేట్ ముట్టడి
● నిరుద్యోగ లోకం కదలిరావాలి
● విజయవంతం చేయాలి
● వైఎస్సార్‌సీపీ యువజన విభాగం పిలుపు
జి.మాడుగుల: కూటమి ప్రభుత్వం నిర్వహించిన ఉపాధ్యాయ నియామక ప్రక్రియలో భారీ ఎత్తున అవకతవకలు, కుంభకోణాలు జరిగాయని.. దీనిపై హైకోర్టు సిట్టింగ్ జడ్జి లేదా సీబీఐతో తక్షణమే విచారణ జరిపించాలని వైఎస్సార్‌సీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు గబ్బాడి శేఖర్, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి అచ్యుత్ డిమాండ్ చేశారు. శనివారం స్థానిక విలేకరులతో వారు మాట్లాడుతూ.. అధిష్టానం ఆదేశాల మేరకు జూన్ ఒకటిన పాడేరులో యువజన విభాగం ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమం చేపట్టనున్నట్లు ప్రకటించారు. నాటి ఉదయం వైఎస్సార్‌సీపీ జిల్లా కార్యాలయం నుంచి కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీగా వెళ్లి కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించనున్నట్లు తెలిపారు. పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న ఈ నిరసనను పార్టీ జిల్లా అధ్యక్షుడు, పాడేరు ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు, అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం ఆధ్వర్యంలో చేపడుతున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆయా నియోజకవర్గాల ముఖ్య నాయ కులు, కార్యకర్తలు తప్పనిసరిగా పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.
నిరుద్యోగుల భవిష్యత్తుతో చెలగాటం!
మెగా డీఎస్సీ పేరుతో కూటమి ప్రభుత్వం లక్షలాది మంది నిరుద్యోగ యువతను వంచించి, వారి భవిష్యత్తుతో దారుణంగా చెలగాటమాడిందని వారు మండిపడ్డారు. నియామకాల్లో పారదర్శకతను తుంగలో తొక్కి, పరీక్షలు ముగిసినా మార్కుల జాబితాను బహిరంగంగా ప్రకటించకుండా కేవలం ఎంపికై న వారికే రహస్యంగా సమాచారం పంపడం పలు అనుమానాలకు తావిస్తోందన్నారు. పరీక్ష రాయకుండానే ఒక అభ్యర్థి స్టేట్ ర్యాంకర్ కాలేదా? అని ప్రశ్నించారు. విషయం బయటపడగానే సదరు అభ్యర్థి వివరాలన్నీ వెబ్‌సైట్ నుంచి మాయం చేయడంపై ప్రభుత్వం సమాధానం చెప్పాలన్నారు. ఒక్కో పోస్టును లక్షల రూపాయలకు అమ్ముకున్నారని, క్రీడల కోటాలో నకిలీ ధ్రువపత్రాలతో అర్హత లేని వారికి ఉద్యోగాలు కట్టబెట్టారని ఆరోపించారు. దీనిపై హైకోర్టు స్పష్టమైన ఉత్తర్వులు ఇచ్చినప్పటికీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు. అక్రమాలకు పాల్పడిన బ్రోకర్లపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని, హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం అర్హులకు తక్షణమే న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ మొత్తం వ్యవహారానికి నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేశారు.


