పెట్రో బాదుడుపై | - | Sakshi
Sakshi News home page

పెట్రో బాదుడుపై

May 19 2026 12:40 AM | Updated on May 19 2026 12:40 AM

పెట్రోల్‌, డీజిల్‌ ధరల పెంపుపై ఆగ్రహజ్వాలలు మిన్నంటాయి. వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో పాడేరు, అరకులోయలలో ఆ పార్టీ నాయకులు, ప్రజలు సోమవారం పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. వ్యాన్‌కు తాడుకట్టి లాగుతూ వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు. పెంచిన ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్‌ చేస్తూ నినాదాలు చేశారు.

జి.మాడుగుల జాతీయ రహదారిపై ఆందోళన చేస్తున్న పాడేరు ఎమ్మెల్యే, వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు విశ్వేశ్వరరాజు, పార్టీ నాయకులు

పాడేరు/ జి.మాడుగుల: పెట్రోల్‌, డీజిల్‌ ధరలను పెంచి రాష్ట్ర ప్రజలపై కూటమి ప్రభుత్వం రూ.3,200కోట్లు భారం మోపిందని, దీంతో సామాన్యుడి మనుగడ ప్రశార్థకరంగా మారిందని పాడేరు ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు మత్స్యరాస విశ్వేశ్వరరాజు అన్నారు. వైఎస్సార్‌సీపీ అధి ష్టానం పిలుపు మేరకు సోమవారం మండల కేంద్రం జి.మాడుగులలో జాతీయ రహదారిపై వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు ఆధ్వర్యంలో వైఎస్సార్‌సీపీ నాయకులు, ప్రజలు ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేశారు. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వల వైఖరికి నిరసనగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అక్కడ నుంచి తహసీల్దార్‌ కార్యాలయం వరకు నినాదాలు చేస్తూ ర్యాలీగా వెళ్లారు. ఇన్‌చార్జీ తహసీల్దార్‌కు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు మాట్లాడుతూ ఎన్నికల్లో కూటమి పార్టీలు పెట్రోల్‌,డీజిల్‌ ధరలు పెంచబోమని చెప్పి, ఇప్పుడు ప్రజలపై తీవ్ర భారం మోపుతున్నాయన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రంలో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు అధికంగా ఉన్నాయని చెప్పారు. కూటమి ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను నిరసిస్తూ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పార్టీలకు సరైన బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ మండల అధ్యక్షుడు నుర్మని మత్స్యకొండంనాయుడు, మాజీ ఎంపీపీ మత్స్య రాస వెంకటగంగరాజు, ఎంపీటీసీ మత్స్యరాస విజయకుమారి, వైఎస్సార్‌సీపీ జిల్లా అధికార ప్రతినిధి కూడా సురేష్‌కుమార్‌, వైఎస్సార్‌సీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు గబ్బాడ శేఖర్‌, తాజా మాజీ సర్పంచ్‌లు మాల్లన్న, ఐసరం హనుమంతరావు, సీదరి కొండబాబు, నియోజకవర్గ వలంటీర్ల విభాగం అధ్యక్షుడు కూర్మరాజు, పార్టీ క్రిస్టియన్‌, మైనార్టీ విభాగం నియోజకవర్గ అధ్యక్షుడు వంతాల కృష్ణారావు, మాజీ ఎంపీటీసీ బ్రహ్మలింగం, మండల మహిళ అధ్యక్షురాలు నీలమ్మ, వైఎస్సార్‌సీపీ నాయకులు సిర్మా పండన్న, రామకృష్ణ్ణ, మన్మధరావు, పెదబాలన్న, చిట్టిబాబు, బంగార్రాజు, రమణ, లింగమూర్తి, కొండబాబు, సన్యాసిరావు, చంటిబాబు తదితరుల పాల్గొన్నారు.

రాష్ట్ర ప్రజలను దోచుకుంటున్న

కూటమి సర్కార్‌ : ఎమ్మెల్యే మత్స్యలింగం

అరకులోయటౌన్‌: రాష్ట్రంలో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెంచి సామాన్యులకు తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తూ, రాష్ట్ర ప్రజల్ని కూటమి ప్రభుత్వం దోచుకుంటోందని అరకులోయ ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం అన్నారు. వైఎస్సార్‌ సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్‌. జగన్‌మోహన్‌ రెడ్డి పిలుపు మేరకు పెట్రోల్‌, డీజిల్‌ ధరల పెంపునకు నిరసనగా సోమవారం అరకులోయలో పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. ముందుగా అరకులోయ ఎమ్మెల్యే క్యాంప్‌ కార్యాలయం నుంచి ర్యాలీ నిర్వహించారు. హెచ్‌పీసీఎల్‌ పెట్రోల్‌ బంక్‌ నుంచి వ్యాన్‌కు తాడుకట్టి తహసీల్దార్‌ కార్యాలయం వరకూ లాగుతూ తీసుకువెళ్లారు. అనంతరం నాలుగు రోడ్ల జంక్షన్‌ వద్ద పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. పెంచిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు తగ్గించాలని, చేతకాని కూటమి ప్రభుత్వం రాజీనామా చేయాలంటూ నినాదాలు చేశారు. అనంతరం డిప్యూటీ తహసీల్దార్‌ సివేరి సురేష్‌కుమార్‌కు వినతి పత్రం అందజేవారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెంచడం వల్ల ఏడాదికి ప్రజలపై రూ. 3 వేల కోట్లకు పైగా అదనపు భారం పడుతుందన్నారు. చంద్రబాబు ప్రభుత్వ పాలనను ప్రజలు గమనిస్తున్నారని, రాబోయే రోజుల్లో తగిన గుణపాఠం తప్పదని హెచ్చరించారు.

ఆరు నెలల నుంచే దోపిడీ :

జెడ్పీ చైర్‌ పర్సన్‌ జల్లిపల్లి సుభద్ర

ఉమ్మడి విశాఖపట్నం జిల్లా పరిషత్‌ చైర్‌ పర్సన్‌ జల్లిపల్లి సుభద్ర మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఆరు నెలల నుంచే దోపిడీ ప్రారంభించిందన్నారు. పెట్రోల్‌, డీజిల్‌, వంట గ్యాస్‌, వంట నూనె, ఇతర నిత్యావసరాల ధరలు పెంచడమే ఇందుకు నిదర్శనమన్నారు. పక్క రాష్ట్రంలో పెట్రోల్‌కు లీటర్‌కు రూ.3, డీజిల్‌కు రూ.2 పెంచితే మన రాష్ట్రంలో పెట్రోల్‌పై రూ.5, డీజిల్‌పై రూ.3.50 పెంచడం అన్యాయమన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ఎస్టీ సెల్‌ ప్రధాన కార్యదర్శి పాంగి చిన్నారావు, పార్టీ యువజన విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు రేగం చాణిక్య, పార్టీ ఎస్టీ సెల్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి శెట్టి అప్పాలు, ఉమ్మడి విశాఖ జిల్లా ఎస్టీ సెల్‌ మాజీ అధ్యక్షుడు కమిడి అశోక్‌, ఎంపీపీలు బాక ఈశ్వరి, మిథుల, ఎంపీటీసీ సభ్యులు దురియా ఆనంద్‌ కుమార్‌, శత్రుఘ్న, రామచందర్‌, జయ వర్ధిని, అరకులోయ, అనంతగిరి, డుంబ్రిగుడ, హుకుంపేట, ముంచంగిపుట్టు మండలాల అధ్యక్షులు రామ్మూర్తి, కొర్రా సూర్యనారాయణ, పాంగి పరశురామ్‌, అనిల్‌, పద్మారావు, విద్యార్థి విభాగం రాష్ట్ర కార్యదర్శి నాగభూషణ్‌, మండల ఉపాధ్యక్షులు పల్టాసింగ్‌ విజయ్‌ కుమార్‌, గుడివాడ ప్రకాష్‌, వైస్‌ ఎంపీపీలు కిల్లో రామన్న, శెట్టి ఆనంద్‌, నియోజకవర్గ గ్రీవెన్స్‌ సెల్‌ అధ్యక్షుడు సందడి కొండబాబు, నియోజకవర్గ బూత్‌ కమిటీ ఇన్‌చార్జీ పాంగి విజయ్‌, నియోజకవర్గ ఎస్టీసెల్‌ అధ్యక్షుడు రేగబోయిన స్వామి, మాజీ సర్పంచ్‌లు పాగి అప్పారావు, సమిడ వెంకట పూర్ణిమ, గుమ్మ నాగేశ్వరరావు, కొర్రా సింహాద్రి, అర్జున్‌, అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.

అరకులోయ డిప్యూటీ తహసీల్దార్‌ సురేష్‌కుమార్‌కు వినతి పత్రం అందజేస్తున్న ఎమ్మెల్యే మత్స్యలింగం, జెడ్పీ చైర్‌పర్సన్‌ జల్లిపల్లి సుభద్ర, నాయకులు

జి.మాడుగులలో ఇన్‌చార్జి తహసీల్దార్‌కు వినతిపత్రాన్ని అందజేస్తున్న పాడేరు ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు విశ్వేశ్వరరాజు

Advertisement
 
Advertisement
Advertisement