స్పీకర్‌ బహిరంగ క్షమాపణ చెప్పాలి | - | Sakshi
Sakshi News home page

స్పీకర్‌ బహిరంగ క్షమాపణ చెప్పాలి

Apr 5 2026 7:48 AM | Updated on Apr 5 2026 7:48 AM

● విదసం రాష్ట్ర కన్వీనర్‌ డిమాండ్‌

నర్సీపట్నం: జాతరలో దళితుడిని కొట్టిన స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు బహిరంగ క్షమాపణ చెప్పాలని విదసం విస్తృత దళిత సంఘాల ఐక్యవేదిక రాష్ట్ర కన్వీనర్‌ డాక్టర్‌ బూసి వెంకటరావు డిమాండ్‌ చేశారు. పండగలో డప్పు కొట్టడానికి వచ్చిన దళితుడిని స్పీకర్‌ చెంప పగల గొట్టడాన్ని నిరసిస్తూ ఐక్య వేదిక ఆధ్వర్యంలో శనివారం నర్సీపట్నం అబిద్‌ సెంటర్‌లోని డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌ వద్ద ప్లకార్డులతో నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేల మంది సమక్షంలో దళితుడిని బహిరంగంగా కొట్టడం స్పీకర్‌ అహంకారానికి నిదర్శనమన్నారు. పండగలో ప్రజలంతా సంతోషంతో ఉంటే, దళితులను లక్ష్యంగా చేసుకుని దాడికి దిగడం అమానుషమన్నారు. తప్పును సరిదిద్దుకోకుండా బాధితుడిని బెదిరించి రాజకీయ ప్రకటన ఇప్పించడం ఆయన దిగజారుడుతనానికి నిదర్శనమన్నారు. తమకు రాజకీయాలు అనవసరమని, తప్పు ఎవరు చేసినా చట్టం ముందు అందరూ సమానమే అన్నారు. నేతల నాగేశ్వరరావు మాట్లాడుతూ అయ్యన్నపాత్రుడుకు దళితులను అవమానించటం పరిపాటిగా మారిందన్నారు. పదవి ఉంటే నేల మీద నిలబడు అన్నారు. మట్ల అప్పారావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో విదసం నాయకులు లావణ్య, గోడి వెంకటేశ్వరరావు, అల్లంపల్లి ఈశ్వరరావు, ఈరెల్లి సుదీర్‌కుమార్‌, చెక్క రాంబాబు, తాతబాబు తదితరులు పాల్గొన్నారు.

స్పీకర్‌ దళితుడిని కొట్టడం అమానుషం: కె.వి.పి.ఎస్‌

నర్సీపట్నం: అమ్మవారి జాతరలో డప్పు కొట్టడానికి వచ్చిన దళితుడిని స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు కొట్టడం అమానుషమని కె.వి.పి.ఎస్‌. నాయకులు పేర్కొన్నారు. రాజ్యాంగ పదవిలో ఉన్న స్పీకర్‌ ఈ విధంగా దాడి చేయటం దారుణమన్నారు. స్పీకర్‌ వంటి వ్యక్తుల వల్లే దళితులపై దాడులు నానాటికీ పెరుగుపోతున్నాయన్నారు. తక్షణమే స్పీకర్‌ అయ్యన్న బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement