పెదగంట్యాడ: గాజువాక ప్రాంతానికి చెందిన ఇద్దరు మహిళా న్యాయవాదులు జూనియర్ సివిల్ జడ్జిలుగా ఎంపికై సరికొత్త చరిత్ర సృష్టించారు. పట్టుదల ఉంటే ఏ వయసులోనైనా విజయం సాధించవచ్చని ధర్మాల లలిత శ్రీ నిరూపించగా, యువ న్యాయవాది కొట్టాన బిందు తొలి అడుగుల్లోనే అత్యున్నత శిఖరాన్ని అధిరోహించారు.
వివాహమైన 15 ఏళ్ల తర్వాత జడ్జిగా లలిత శ్రీ
ధర్మాల లలిత శ్రీ ప్రస్థానం ఎందరికో స్ఫూర్తిదాయకం. వివాహమైన 15 ఏళ్ల తర్వాత ఆమె ఉన్నత చదువులపై దృష్టి సారించారు. ముందుగా పీజీ పూర్తి చేసి, ఆపై ఎల్‌ఎల్‌బీ పట్టా పొందారు. న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తూనే సివిల్ జడ్జి పరీక్షలకు సిద్ధమయ్యారు. కేవలం రెండో ప్రయత్నంలోనే జూనియర్ సివిల్ జడ్జిగా ఎంపికై తన కలని సాకారం చేసుకున్నారు.
తొలి అడుగులోనే విజయం సాధించిన బిందు : జీవీఎంసీ స్టాండింగ్ కౌన్సిల్ సీనియర్ న్యాయవాది ఎం. శాంతి కుమార్తె కొట్టాన బిందు కూడా జడ్జిగా ఎంపికయ్యారు. సబ్బవరంలోని దామోదరం సంజీవయ్య జాతీయ న్యాయ విశ్వవిద్యాలయంలో ఎల్‌ఎల్‌బీ పూర్తి చేసిన ఈమె, సీనియర్ న్యాయవాది వెన్నెల ఈశ్వరరావు వద్ద జూనియర్ లాయర్‌గా ప్రాక్టీస్ చేస్తున్నారు. వృత్తిలో రాణిస్తూనే జూనియర్ సివిల్ జడ్జిగా విజయం సాధించారు. గాజువాక బార్ అసోసియేషన్ నుంచి ఒకేసారి ఇద్దరు మహిళలు న్యాయమూర్తులుగా ఎంపిక కావడంపై బార్ అసోసియేషన్ అధ్యక్షురాలు యశోధర వేదమణి హర్షం వ్యక్తం చేశారు.
ధర్మాల లలితాశ్రీ
కొట్టాన బిందు
జూనియర్ సివిల్ జడ్జిలుగా ఇద్దరు మహిళలు


