సాగు విధానం | - | Sakshi
Sakshi News home page

సాగు విధానం

Apr 4 2026 7:37 AM | Updated on Apr 4 2026 7:37 AM

జాగ్రత్త పడితేనే జవజీవం అన్నట్లుగా.. మారుతున్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా రైతులు తమ సాగు విధానాన్ని మార్చుకోవాలి. శాస్త్రవేత్తల సూచనలు పాటిస్తూ ప్రత్యామ్నాయ పంటల వైపు అడుగులు వేస్తేనే పొంచి ఉన్న ఎల్‌నినో ముప్పు నుంచి బయటపడి గిరిజన వ్యవసాయాన్ని నిలబెట్టుకోవచ్చని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు.
మళ్లాల్సిన
గిరి సాగుకు ఎల్‌నినో గండం

నీటి పొదుపే శ్రీరామరక్ష

చిరుధాన్యాలు, ప్రత్యామ్నాయ

పంటలే శ్రేయస్కరం

గిరి రైతులకు శాస్త్రవేత్తల సూచన

మారుతున్న కాలం

విత్తే సమయం మార్చుకోవాలి

కాలం మారితే.. సాగు మారాలి అన్నట్లుగా.. మారుతున్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా మన విత్తే సమయాన్ని, పంటల ఎంపికను మార్చుకోవాలి. చింతపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానంలో ఇటీవల జరిగిన సదస్సులో శాస్త్రవేత్తలు సూచించినట్లుగా, ఏజెన్సీ రైతులు అప్రమత్తంగా ఉంటేనే ఎల్‌ నినో ముప్పు నుంచి బయటపడగలం.

పొంచి ఉన్న వర్షాభావం

చింతపల్లి: ప్రకృతి ఒడిలో సాగే ఏజెన్సీ వ్యవసాయానికి ఎల్‌నినో ముప్పు పొంచి ఉంది. రానున్న రోజుల్లో వర్షపాతం గణనీయంగా తగ్గే అవకాశం ఉందని ఇప్పటి నుంచి వాతావరణ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తూ గిరిజన రైతులను అప్రమత్తం చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో సాగు పద్ధతుల్లో మార్పులు చేసుకోకపోతే భారీ నష్టాలు తప్పవని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్‌ కుమార్‌ ఇటీవల స్థానిక ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానంలో నిర్వహించిన సదస్సులో స్పష్టం చేశారు.

పసిఫిక్‌ మహాసముద్ర ఉపరితల ఉష్ణోగ్రతల్లో వచ్చే మార్పుల వల్ల ఏర్పడే ఎల్‌ నినో ప్రభావంతో రుతుపవనాలు బలహీనపడతాయి. దీనివల్ల ఏజెన్సీ ప్రాంతంలో సగటు కంటే తక్కువ వర్షపాతం నమోదు కావొచ్చు. భూగర్భ జలాలు అడుగంటి, సాగునీటి ఎద్దడి ఏర్పడే అవకాశం ఉంది. ఉష్ణోగ్రతలు పెరిగి పంటలు త్వరగా ఎండిపోతాయి. ఎక్కువ నీటిపై ఆధారపడే పంటలు ఈ పరిస్థితుల్లో తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు.

కాఫీ: ఏజెన్సీ ప్రాంతానికి కాఫీ ఒక ప్రధాన జీవనాధారం. ఇది చాలా సున్నితమైన పంట. దీనికి మితమైన ఉష్ణోగ్రత (15ని డిగ్రీల నుంచి నుంచి 28ని డిగ్రీలు), అధిక ఆర్ద్రత ఉండాలి. పూత పూసే సమయంలో (మార్చి–ఏప్రిల్‌) తేలికపాటి వర్షాలు చాలా అవసరం. ఎల్‌నినో వల్ల ఉష్ణోగ్రతలు పెరిగితే కాఫీ గింజలు సరిగ్గా ఊరవు. తేమ తగ్గిపోవడం వల్ల వైట్‌ స్టెమ్‌ బోరర్‌ వంటి పురుగులు ఆశించే ప్రమాదం ఉంది. సమయానికి వర్షాలు లేకపోతే దిగుబడి పడిపోతుంది.

మిరియం: ఉష్ణోగ్రత 10ని డిగ్రీల నుంచి 30ని డిగ్రీల మధ్య ఉండాలి. ఏడాదికి 150 నుంచి 250 సెంటీమీటర్ల వర్షం అవసరం. ముఖ్యంగా పూత పూసే సమయంలో (మే–జూన్‌ నెలల్లో) తొలకరి చినుకులు పడటం చాలా కీలకం.గాలిలో తగినంత తేమ ఉంటేనే మిరియాల తీగలు ఆరోగ్యంగా పెరుగుతాయి. వర్షాలు తగ్గితే పూత రాలుతుంది. పూత దశలో చిరుజల్లులు కురిస్తేనే పరాగసంపర్కం జరుగుతుంది. వర్షాలు ఆలస్యమైనా.. అసలు కురవకపోయి పూత ఎండిపోయి రాలిపోతుంది. మిరియం తీగలు ఎండ తీవ్రతను అస్సలు తట్టుకోలేవు. వాతావరణంలో వేడి పెరిగితే ముక్కు పురుగు, వేరు కుళ్లు తెగులు ఆశించే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

వరి: గిరిజన రైతులు పల్లపు ప్రాంతాల్లో, గెడ్డల వెంట వరిని ప్రధానంగా సాగు చేస్తున్నారు. ఈ పంటకు నిరంతరం నీటి లభ్యత ఉండాలి. సాగు కాలంలో కనీసం 100–150 సెంటీమీటర్ల వర్షపాతం అవసరం. ఎల్‌నినో వల్ల వర్షాభావం నెలకొంటే నారుమళ్లు ఎండిపోతాయి. నీరు తక్కువైతే పొట్ట దశలో గింజ పాలుపోసుకోదు. దీనివల్ల తాలు ఎక్కువగా వస్తుంది. ఎక్కువ వేడి వల్ల ఆకు ముడత తెగుళ్లు పెరిగే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు.

చిరుధాన్యాలు: రాగులు, సామలు, కొర్రలు ఏజెన్సీ ప్రాంతపు సంప్రదాయ పంటలు.ఇవి తక్కువ నీటితో పండే పంటలు. వీటికి 25ని డిగ్రీల నుంచి 35ని డిగ్రీల ఉష్ణోగ్రత సరిపోతుంది. తక్కువ వర్షపాతం (50–70 సెంటీమీటర్లు) ఉన్నా ఇవి తట్టుకోగలవు. మిగిలిన పంటలతో పోలిస్తే వీటికి ముప్పు తక్కువే. కానీ, విత్తే సమయంలో అస్సలు వర్షం లేకపోతే మొలక శాతం తగ్గుతుంది.అయితే, వరితో పోలిస్తే ఎల్‌నినో పరిస్థితుల్లో రైతును ఆదుకునేవి ఇవే.

రాజ్‌మా: శీతాకాలంలో ఏజెన్సీలో పండే అత్యంత విలువైన పంట.దీనికి చల్లని వాతావరణం (15 డిగ్రీల నుంచి 25డిగ్రీలు) ఉండాలి. పూత, కాయ దశలో తక్కువ తేమ, పగటిపూట మితమైన ఎండ ఉండాలి. ఎల్‌నినో వల్ల శీతాకాలంలో కూడా ఉష్ణోగ్రతలు పెరిగితే రాజ్‌మా పూత సరిగ్గా రాదు. మంచు కురవాల్సిన సమయంలో వేడి గాలులు వీస్తే కాయ సైజు తగ్గిపోతుంది, గింజ నాణ్యత దెబ్బతింటుంది.

ఎల్‌నినో ప్రభావం వల్ల రానున్న రోజుల్లో వర్షాభావ పరిస్థితులు తలెత్తే అవకాశాలు ఉన్నాయని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్‌ కుమార్‌ తెలిపారు. ఇటీవల చింతపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానంలో జరిగిన సదస్సులో పలు సూచనలు చేశారు. రైతులు తమ సాగు పద్ధతుల్లో మార్పులు చేసుకోవాలన్నారు. వర్షాలు తక్కువగా కురిసే అవకాశం ఉన్నందున, ఎక్కువ నీరు అవసరమయ్యే పంటలను తగ్గించాలని, చిరుధాన్యాలు, రాజ్‌మా, వలిసెలు (అలసందలు) వంటి తక్కువ నీటితో పండే పంటలపై మొగ్గు చూపాలని పేర్కొన్నారు. మారుతున్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా విత్తే సమయం, సాగునీటి యాజమాన్యంలో రైతులు అప్రమత్తంగా ఉండాలన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement