చింతపల్లి: ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను గిరిజన కాఫీ రైతులు సద్వినియోగం చేసుకోవాలని జెడ్పీటీసీ పోతురాజు బాలయ్య పడాల్ పిలుపునిచ్చారు. శుక్రవారం చింతపల్లిలోని ఉద్యానవన నర్సరీ శిక్షణ కేంద్రం (హెచ్‌ఎన్‌టీసీ) లో ఐటీడీఏ కాఫీ అసిస్టెంట్ డైరెక్టర్ లకే బొంజుబాబుతో కలిసి ఆయన రైతులకు పరికరాలను పంపిణీ చేశారు. ఇందులో భాగంగా కాఫీ బేబీ పల్పింగ్ యూనిట్లు, మిరియాలు కోసే నిచ్చెనలు, టార్పాలిన్లను అందజేశారు. ప్రభుత్వం రైతుల ప్రయోజనం కోసం ఉచితంగా అందజేస్తున్న పరికరాలను ప్రతి రైతు వినియోగించుకోవాలని ఆయన కోరారు. ఆధునిక పరికరాలను ఉపయోగించి పంట దిగుబడిని పెంచుకోవడమే కాకుండా, నాణ్యమైన ఉత్పత్తుల ద్వారా అధిక ఆదాయం పొందేందుకు కృషి చేయాలని సూచించారు. ఐటీడీఏ పరిధిలోని మాక్స్ సొసైటీల ద్వారా కాఫీ విక్రయాలు జరిపితే రైతులకు మరిన్ని పథకాలు వర్తిస్తాయని ఆయన పేర్కొన్నారు. గతంలో జీసీసీని నమ్మి గిరిజన రైతులు నష్టపోయారని ఈ సందర్భంగా ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో రైతులకు నిచ్చెనలు 400, బేబీ పల్పింగ్ మిషన్లు 400, టార్పాలిన్లు 100 పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కాఫీ ఏఈవో ధర్మారాయ్, గూడెంకొత్తవీధి, జి.మాడుగుల కాఫీ అసిస్టెంట్లు అరుణకుమారి, బాబూరావుతో పాటు పలువురు కాఫీ రైతులు, కూటమి నాయకులు పాల్గొన్నారు.
జెడ్పీటీసీ పోతురాజు బాలయ్య పడాల్


