ఆదివాసీ హక్కుల రక్షణే లక్ష్యం | - | Sakshi
Sakshi News home page

ఆదివాసీ హక్కుల రక్షణే లక్ష్యం

Apr 4 2026 7:37 AM | Updated on Apr 4 2026 7:37 AM

పాడేరు రూరల్‌: ఆదివాసీల హక్కులు, చట్టాల పరిరక్షణ కోసం కూటమి ప్రభుత్వం మెడలు వంచైనా పోరాడుతామని ఆదివాసీ జేఏసీ జిల్లా చైర్మన్‌ రామారావుదొర స్పష్టం చేశారు. ప్రజా సమస్యల పరిష్కారం, గిరిజన చట్టాల రక్షణ కోరుతూ ఆదివాసీ జేఏసీ నిర్వహించిన 146 రోజుల సత్యాగ్రహ యాత్ర శుక్రవారంతో ముగిసింది. ఈ సందర్భంగా పాడేరులో భారీ ముగింపు ర్యాలీ నిర్వహించారు. స్థానిక తలారిసింగి నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ ఆర్టీసీ కాంప్లెక్స్‌, సినిమా హాల్‌ సెంటర్‌ మీదుగా పాత పాడేరులోని అంబేడ్కర్‌ సెంటర్‌ వరకు కొనసాగింది. అనంతరం జరిగిన సభలో రామారావుదొర మాట్లాడుతూ ఆదివాసీ ప్రాంతాల్లో హక్కులు, చట్టాలు రోజురోజుకూ దిగజారిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. 5వ షెడ్యూల్‌ ప్రాంతాల్లో ఆదివాసీలకు సార్వభౌమాధికారం ఉన్నప్పటికీ, అభివృద్ధి ఫలాలు మాత్రం గిరిజనేతరులకే అందుతున్నాయని విమర్శించారు.ఎన్నికల సమయంలో కూటమి నాయకులు ఇచ్చిన హామీలను విస్మరించారని ఆయన మండిపడ్డారు. రెండేళ్లు కావస్తున్నా నిరుద్యోగ భృతి ఊసే లేదని ధ్వజమెత్తారు.అరకు బహిరంగ సభలో చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు ప్రత్యేక డీఎస్సీ నిర్వహించి ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. జీవో నంబర్‌ 3ను తక్షణ పునరుద్ధరించాలని లేదా దానికి ప్రత్యామ్నాయంగా 100 శాతం రిజర్వేషన్‌ కల్పించే జీవోను తీసుకురావాలని డిమాండ్‌ చేశారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా రాష్ట్రంలో రెడ్‌ బుక్‌ రాజ్యాంగాన్ని నడిపిస్తున్నారని ఆయన ఆరోపించారు. ప్రభుత్వానికి ఆదివాసీల పట్ల చిత్తశుద్ధి ఉంటే వెంటనే గిరిజన ప్రాంతాల్లో ఉద్యోగ రిజర్వేషన్లు కల్పించాలని, లేనిపక్షంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అఖిల భారత గిరిజన ఉద్యోగుల సంఘం అధ్యక్షులు ఎం. ఈశ్వరరావు, ఆదివాసీ ఫెడరేషన్‌ రాష్ట్ర నాయకులు చిట్టపుల్లి శ్రీనివాస పడాల్‌, నాయకులు కిల్లు గంగన్న పడాల్‌, వెంకటరమణ, నందు, సింహాచలం, బాబూజీ పాల్గొన్నారు.

కూటమి ప్రభుత్వం మెడలు వంచైనా హక్కులు సాధించుకుంటాం

ఆదివాసీ జేఏసీ జిల్లా చైర్మన్‌

రామారావుదొర హెచ్చరిక

146 రోజుల సత్యాగ్రహ యాత్ర ముగింపు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement