సింహాచలం: ఈ నెల 17న గంధం అమావాస్య పురస్కరించుకుని వరాహ పుష్కరిణి వద్ద స్నానాలు ఆచరించేందుకు వచ్చే భక్తుల సౌకర్యార్ధం పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నట్లు సింహాచలం దేవస్థానం ఈవో జె.వెంకటరావు తెలిపారు. వరాహ పుష్కరిణి వద్ద ఏయే ఏర్పాట్లు చేయాలో శుక్రవారం ఆయన పరిశీలించారు. భక్తులు కోనేరులో దిగే సమయంలో ఎలాంటి అపశ్రుతులు చోటుచేసుకోకుండా పటిష్టమైన బారికేడ్లు ఏర్పాటు చేయాలని సూచించారు. గజ ఈతగాళ్లను, కోనేరు పరిసర ప్రాంతాల్లో విద్యుత్ దీపాలు ఏర్పాటు చేయాలన్నారు. పరిశుభ్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, ఎక్కడా చెత్త ఉండకూడదని ఆదేశించారు. నీటిలో లోతైన ప్రదేశాలకు వెళ్లకుండా హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేయాలన్నారు. ఆయన వెంట ఈఈలు రాంబాబు, వెంకటరమణ, డీఈ తాతాజీ ఉన్నారు.


