ముంచంగిపుట్టు : మత్స్యగెడ్డలో ఏర్పాటుచేయనున్న వాటర్ ఏరోడ్రోమ్ ప్రాజెక్టులో స్థానిక గిరిజనులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలని ఉమ్మడి విశాఖ జిల్లాల జెడ్పీ చైర్‌పర్సన్ జల్లిపల్లి సుభద్ర డిమాండ్ చేశారు. ఆంధ్ర–ఒడిశా సరిహద్దు ప్రాంతమైన ముంచంగిపుట్టు మండలం జోలాపుట్టు పంచాయతీ కేంద్రంలోని మత్స్యగెడ్డలో మంజూరైన వాటర్ ఏరోడ్రోమ్ ప్రాజెక్టు ఏర్పాటు కోసం ఏపీ కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో ఏపీ ఎయిర్ పోర్ట్స్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ద్వారా బుధవారం ప్రజాభిప్రాయ సేకరణ సదస్సును నిర్వహించారు. జోలాపుట్టు పంచాయతీలోని 11 గ్రామాల నుంచి గిరిజనులు ప్రజాభిప్రాయ సేకరణలో పాల్గొని వారి అభిప్రాయాలు తెలియజేశారు. మాచ్‌ఖండ్ జలవిద్యుత్ కేంద్రం నిర్మించి 70 ఏళ్ల అవుతున్నా ప్రాజెక్టు వలన భూములు కోల్పోయిన వారికి నేటీకీ ఎటువంటి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లేకుండా పోయాయని, మైదాన ప్రాంతానికి చెందిన వారికే మాచ్‌ఖండ్ విద్యుత్ కేంద్రంలో ఉద్యోగాలు కల్పిస్తున్నారని, తమకు తీరని అన్యాయం జరిగిందని స్థానిక గిరిజనులు చెప్పారు. ప్రస్తుతం నిర్మించే వాటర్ ఏరోడ్రోమ్ ప్రాజెక్టులో 85 శాతం ఉద్యోగాలు స్థానిక గిరిజనులకే కల్పిస్తామని తీర్మాణం చేస్తేనే ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు.
ప్రాజెక్టులో స్థానిక గిరిజనులకే ప్రాధాన్యం
కార్యక్రమంలో పాల్గొన్న ఉమ్మడి విశాఖ జిల్లాల జెడ్పీ చైర్‌పర్సన్ జల్లిపల్లి సుభద్ర మాట్లాడుతూ వాటర్ ఏరోడ్రోమ్ ప్రాజెక్టు నిర్మిస్తే జోలాపుట్టు పంచాయతీ గిరిజనులకు న్యాయం జరిగేలా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలని, ఎంత మందికి ఉద్యోగాలు ఇస్తారో స్పష్టమైన తీర్మానం చేయాలన్నారు. ముఖ్యంగా భూ బదలాయింపు చట్టం, గిరిజన హక్కులు, చట్టాలకు ఎటువంటి భంగం కలకుండా చూడాలని, బినామీ వ్యవస్థ ఉండకూడదని స్పష్టం చేశారు. జోలాపుట్టు పరిసర గ్రామాల్లో చేపల వేట చేసే గిరిజనులకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని, పర్యావరణం కలుషితం కాకుండా ప్రాజెక్టు నిర్మాణం చేయాలన్నారు.
ఫిషింగ్ టూరిజం ఏర్పాటుకు చర్యలు
కార్యక్రమంలో పాల్గొన్న ఇన్‌చార్జి జాయింట్ కలెక్టర్ , ఐటీడీఏ పీవో తిరుమణి శ్రీపూజ మాట్లాడుతూ అందరి అనుమతులతోనే ప్రాజెక్టు నిర్మించాలనే ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించడం జరుగుతుందన్నారు. స్థానిక గిరిజన యువతీ, యువకులకు ప్రాజెక్టులో ఉద్యోగాల కల్పన కోసం చర్యలు తీసుకుంటామన్నారు. జోలాపుట్టు పరిసర ప్రాంతాలు పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు రూ.16.45కోట్లతో మంజూరైన వాటర్ ఏరోడ్రోమ్ ప్రాజెక్టు ఉపయోగపడుతుందన్నారు. అన్ని అనుమతులతోనే ప్రాజెక్ట్ నిర్మాణం జరుగుతుందని, గిరిజన మత్స్యకారుల కోసం ఫిషింగ్ టూరిజం ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామన్నారు.
విశాఖపట్నం, విజయనగరం కాలుష్య నియంత్రణ మండలి ఈఈలు సరిత, ఉపేంద్ర, టూరిజం డీవీఎం జి.వి.బి.జగదీష్, విశాఖకు చెందిన పర్యవరణవేత్త జె.పి.రామారావు, జి.మాడుగుల సీఐ శ్రీనివాసరావు, తహసీల్దార్ భాస్కరఅప్పారావు, సర్పంచ్ నీలకంఠం, ఎంపీటీసీలు కమల, సుబ్బలక్ష్మీ, వివిధ పార్టీల నేతలు జగబంధు, దశరధి, మూర్తి, ఎండీ సోలెమాన్, మణి, ప్రకాశ్, రామస్వామి, రాందాసు, భగత్‌రామ్, స్థానికులు పాల్గొన్నారు.
వాటర్ ఏరోడ్రోమ్ ప్రాజెక్ట్ ఏర్పాటుకు ప్రజాభిప్రాయ సేకరణ
గిరిజన హక్కులు, చట్టాలకు విఘాతం కలగకుండా ప్రాజెక్టు నిర్మించాలి
జెడ్పీ చైర్ పర్సన్ జల్లిపల్లి సుభద్ర
పూర్తిస్థాయి అనుమతులతోనే పనులు
ఇన్‌చార్జి జాయింట్ కలెక్టర్ ,
ఐటీడీఏ పీవో తిరుమణి శ్రీపూజ


