● డిమాండ్ల సాధన కోసంయూటీఎఫ్ రణభేరి 3.0
● ఐటీడీఏ కార్యాలయం ఎదుట రీలే దీక్ష
పాడేరు : ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల మాదిరిగానే ఉద్యోగ, ఉపాధ్యాయులకు సూపర్ సిక్స్ హామీలను ఇచ్చిన కూటమీ పార్టీలు అధికారంలోకి వచ్చాక ఏ ఒక్క హామీను కూడా పూర్తి స్థాయిలో పరిష్కరించకుండా నిలువునా మోసం చేసిందని యూటీఎఫ్ జిల్లా అద్యక్ష, కార్యదర్శులు రఘునాధ్, మహేశ్వరరావు ఆరోపించారు. రాష్ట్ర వ్యాప్త కార్యక్రమంలో భాగంగా బుధవారం స్థానిక ఐటీడీఏ ఎదుట యూటీఎఫ్ ఆధ్వర్యంలో రణభేరి 3.0 ఒక రోజు రిలే దీక్షను చేపట్టారు. ఈ దీక్షలను యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీలక్ష్మి, గిరిజన ఉద్యోగుల సంఘం జిల్లా అద్యక్షుడు మసాడ ఈశ్వరరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా పలువురు నేతలు మాట్లాడుతూ హామీలు అమలుచేయకుండా ఉపాధ్యాయులను చంద్రబాబు మోసం చేశారనన్నారు. ఉద్యోగ, ఉపాద్యాయులపై కూటమీ ప్రభుత్వం అవలంభిస్తున్న తీరుకు నిరసనగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. పీఆర్సీ కమిషన్‌ను వెంటనే నియమించాలని , ఆర్థిక బకాయిలన్నింటిని తక్షణమే చెల్లించాలని, 29 శాతం ఐఆర్ ప్రకటించాలని, పాత డీఏ బకాయిలు చెల్లించాలని, ఓపీఎస్ విధానాన్ని అమలు చేయాలని, కేజీబీవీ, ఎంటీఎస్ ఉపాద్యాయుల సమస్యలను పరిష్కారించాలని వారంతా ముక్త కంఠంతో డిమాండ్ చేశారు.
రిలే దీక్షకు పలు సంఘాల మద్దతు
యూటీఎఫ్ చేపట్టిన దీక్షకు పలు ఉద్యోగ, ఉపాద్యాయ సంఘాల నాయకులు పాల్గొని మద్దతు తెలిపారు. సీపీఎస్ జిల్లా అద్యక్షుడు మోరి మోహన్‌బాబు, ప్రతినిధులు యువరాజు, గంపరాయి రమేష్, ఉబ్బేటి నరేష్, దండకారణ్య ఉద్యోగ సమితి రాష్ట్ర కార్యదర్శి యం.రాజాబాబు, బీటీఏ జిల్లా అద్యక్షుడు వి.వెంకటరమణ, ఏపీ జేఏసీ డివిజన్ చైర్మన్ కె.సుబ్రమణ్యం, కార్యదర్శి జి.సింహాచలం పాల్గొని సంఘీభావం తెలిపి దీక్షలో కూర్చున్నారు. అనంతరం యూటీఎఫ్‌తో సహా పలు ఉద్యోగ, ఉపాద్యాయ సంఘాల ప్రతినిధులు, నాయకుల సమస్యలపై ఇన్‌చార్జి ఆర్డీవో లోకేశ్వరరావుకు వినతిపత్రాన్ని అందజేశారు. యూటీఎఫ్ నాయకులు చీకటి నాగేశ్వరరావు, పార్వతి, చిట్టిబాబు, ధరమారావు, దేముడు, కన్నయ్య, శ్రీను, రాంబాబుతో పాటు జిల్లాలోని పలు మండలాల ప్రతినిధులు పాల్గొన్నారు.


