డ్వామా పీడీ విద్యాసాగర్
ముంచంగిపుట్టు: ఉపాధి హామీ పథకం ద్వారా జరిగే పనులపై క్షేత్రసాయిలో జవాబుదారీతనంగా ఉపాధి సిబ్బంది పనిచేయాలని జిల్లా డ్వామా పీడీ డి.విద్యాసాగర్ అన్నారు. ఉపాధి హామీ పథకం ద్వారా 2024–25 ఆర్థిక సంవత్సరంలో చేపట్టిన పనులపై ప్రజావేదిక కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. ఈ మేరకు ఉపాధి పనుల్లో రూ.26.25కోట్లకు, మెటీరియల్ ద్వారా రూ.94.81లక్షలు, పంచాయతీ రాజ్ శాఖ ద్వారా రూ.6,22,99,000, ట్రైబల్ వెల్ఫేర్ శాఖ ద్వారా రూ.7,54,58,000, సమగ్ర శిక్ష అభియాన్ శాఖ ద్వారా రూ.46లక్షలతో జరిగిన పనులపై ఇటీవల 17వ విడత సామాజిక తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యాసాగర్ మాట్లాడుతూ పనులు పారదర్శకంగా జరగాలని, వేతనదారులకు మస్తర్లు సకాలంలో సక్రమంగా వేయాలని ఆదేశించారు.పనుల కల్పనలో అవకతవకలు జరిగితే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. మండలంలో అన్ని పంచాయతీల్లో సామాజిక తనిఖీల్లో రూ.14, 500లు రికవరీ చేయగా, రూ.18,900 అపరాధ రుసుము విధించినట్టు చెప్పారు. ఏపీడీ వెంకటరావు, ఎంపీపీ సీతమ్మ, మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు రమేష్, ఎంపీడీవో ధర్మారావు, ఏపీవోలు సంఘంనాయుడు, వెంటేశ్వర్లు, ఎస్‌ఆర్‌పీలు అప్పారావు, అచ్యుతరావు, డీఆర్‌పీలు నరసింహామూర్తి, రాజేశ్వరరావు, వరహాలమ్మ, సర్పంచులు, ఎంపీటీసీలు, ఉపాధి హామీ పిబ్బంది, వేతనదారులు తదితరులు పాల్గొన్నారు.


