పాడేరు రూరల్: కార్మిక చట్టాలు, హక్కులు పటిష్టంగా అమలు చేయడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమైనట్టు ఏఐటీయూసీ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జల్లి రాజబాబు, అమర్ చెప్పారు. పాడేరు ఐటీడీఏ ముఖద్వారం వద్ద కేంద్ర కార్మిక సంఘాల ఐక్యవేదిక పిలుపుమేరకు ఏఐటీయూసీ జిల్లా సమితి బుధవారం ధర్నా చేపట్టారు. నాయకులు నల్లరిబ్బన్‌లతో కళ్లకు గంతలు కట్టుకొని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరుకు వ్యతిరేకంగా నిరసన తెలిపారు. కార్మిక చట్టాలను నిర్వీర్యం చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కుట్ర చేస్తున్నాయన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్‌ల వల్ల కార్మికులకు అదనపు పనిభారం పెరుగుతోందని, దీంతో తీవ్ర నష్టం జరుగుతోందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిరంకుశ పాలనకు అందరూ వ్యతిరేకించాలన్నారు. ఈ మేరకు కేంద్ర కమిటీ పిలుపుమేరకు ఏప్రిల్ 1న బ్లాక్ డేగా పాటించామన్నారు. గతంలో ఉన్న కార్మిక చట్టాలను కొనసాగించి, అమలు చేయాలని లేనిపక్షంలో భవిష్యత్‌లో ఉద్యమాలు తీవ్రం చేస్తామని వారు చెప్పారు. కార్మిక సంఘాల జిల్లా కార్యదర్శి రాంబాబు, ఉపాధ్యక్షుడు కృష్ణ, నాయకులు శివశంకర్, లక్ష్మయ్య, సత్తిబాబు పాల్గొన్నారు.


