ఇమ్మానుయేలు సంస్థ హాస్టల్లో అగ్నిప్రమాదం | - | Sakshi
Sakshi News home page

ఇమ్మానుయేలు సంస్థ హాస్టల్లో అగ్నిప్రమాదం

Mar 30 2026 8:30 AM | Updated on Mar 30 2026 8:30 AM

ప్రమాద సమయంలో లేని విద్యార్థులు

తప్పిన పెనుప్రమాదం

మాకవరపాలెం: హాస్టల్లో అగ్ని ప్రమాదం జరిగింది. ఆ సమయంలో విద్యార్థులు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. మండలంలోని కొండల అగ్రహారంలో ఇమ్మానుయేలు సంస్థ నిర్వహిస్తున్న హాస్టల్లో ఆదివారం ఈ ఘటన చోటు చేసుకుంది. ఇక్కడ ఉమ్మడి జిల్లాకు చెందిన 80 మంది విద్యార్థులు ఉంటున్నారు. వీరంతా నిత్యం ఉదయం తామరంలో సంస్థకు చెందిన ఎడ్యుకేషన్‌ క్యాంపస్‌లోని స్కూల్‌కు బస్సుపై వెళ్లి తిరిగి సాయంత్రం హాస్టల్‌కు చేరుకుంటారు. ఆదివారం మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో మూడు అంతస్థులు కలిగిన హాస్టల్‌ భవనంలో గ్రౌండ్‌ ఫ్లోర్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఆ సమయంలో స్థానికులు గమనించిన వెంటనే స్పందించి మంటలు చెలరేగిన గదుల్లో ఎవరూ లేకపోవడంతో రెండో అంతస్థులో ఉన్న పది మంది విద్యార్థులను బయటకు తీసుకువచ్చారు. వెంటనే అగ్నిమాపక కేంద్రానికి సమాచారం ఇవ్వడంతో సిబ్బంది సకాలంలో చేరుకుని మంటలను అదుపు చేశారు. అయితే ప్రతి ఆదివారం ఈ విద్యార్థులంతా హాస్టల్‌కు సమీపంలో సంస్థకు చెందిన చర్చికు వెళతారు. ఆదివారం కూడా సుమారు 70 మంది వరకు చర్చికి వెళ్లడంతో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. ఇదే అగ్నిప్రమాదం రాత్రి వేళలో జరిగితే ఎందరో విద్యార్థులు మృత్యువాత పడే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. మధ్యాహ్నం 2 గంటల తర్వాత జరిగి నా గాయపడేవారన్నారు. ఈ సంఘటనలో హాస్టల్లో ఉన్న ఒక బైక్‌తోపాటు విద్యార్థుల పుస్తకాలు, బట్టలు ఉంచిన పెట్టెలు కాలిపోయాయి. విద్యార్థులంతా క్షేమంగా ఉండటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నా రు. కాగా విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా ఈ అగ్ని ప్రమాదం జరిగి ఉండవచ్చని అనుమానిస్తున్నారు.

హాస్టల్‌ను పరిశీలించిన ఎంఈవో

హాస్టల్‌ను ఎంఈవో మూర్తి పరిశీలించారు. ఈ సందర్భంగా మంటలు చెలరేగిన హాస్టల్‌ భవనం, కాలిపోయిన విద్యార్థులు పెట్టెలను పరిశీలించారు. హాస్టల్‌లో ఉంటున్న విద్యార్థుల సంఖ్యను తెలుసుకున్నారు. నివేదికను డీఈవోకు అందజేశామని, విద్యార్థులను ఇక్కడి నుంచి తామరంలో ఇమ్మానుయేలు సంస్థకు చెందిన మరో హాస్టల్‌కు తరలించామని తెలిపారు. షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా ప్రమాదం జరిగినట్టు ప్రాథమికంగా అంచనా వేశామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement