ఇదేం ‘పచ్చ’పాతం | - | Sakshi
Sakshi News home page

ఇదేం ‘పచ్చ’పాతం

Mar 30 2026 8:30 AM | Updated on Mar 30 2026 8:30 AM

దేవరాపల్లి పార్కులో శిలాఫలకాల ఏర్పాటులో ప్రొటోకాల్‌కు తూట్లు

గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో నిర్మాణ పనులకు శ్రీకారం

శంకుస్థాపన చేసి, శిలాఫలకం ఆవిష్కరించిన అప్పటి డిప్యూటీ సీఎం బూడి

తాజాగా పార్కు ప్రారంభోత్సవ శిలాఫలకాన్ని ఏర్పాటు చేసిన అధికారులు

శంకుస్థాపన చేసిన శిలాఫలకాన్ని మూలన పడేసిన వైనం

దేవరాపల్లి: మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన పార్కులో శంకుస్థాపన శిలాఫలకాన్ని ఏర్పాటు చేయకుండా మూలన పడేయడం వివాదస్పదమైంది. తాజాగా పార్కు ప్రారంభోత్సవ శిలాఫలకాన్ని ఏర్పాటు చేసిన వీఎంఆర్డీఏ అధికారులు శంకుస్థాపన శిలాఫకం ఏర్పాటులో పక్షపాత వైఖరిని ప్రదర్శించడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో...

స్థానిక పోలీస్‌స్టేషన్‌కు ఎదురుగా శిథిలావస్థకు చేరుకుని దశాబ్దాలుగా అధ్వానంగా ఉన్న ఇరిగేషన్‌ క్వార్టర్స్‌ను తొలగించి ఆహ్లాదకర పార్కు, యోగా భవనం, వాకింగ్‌ ట్రాక్‌ నిర్మించాలని గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు సంకల్పించారు. అప్పట్లోనే వీఎంఆర్డీఏ నుంచి రూ. 75 లక్షలు మంజూరు చేసి శిలాఫలకాన్ని ఆవిష్కరించి, నిర్మాణ పనులకు ఆయన శ్రీకారం చుట్టారు. సగం పనులను సైతం అప్పట్లోనే పూర్తి చేశారు. సార్వత్రిక ఎన్నికల కోడ్‌ రావడంతో నిర్మాణ పనులకు ఆటంకం ఏర్పడింది. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం మిగిలిన పనులను పూర్తి చేసింది. ఈ నెల 13న పార్క్‌ను స్థానిక ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ మూర్తి, వీఎంఆర్డీఏ కమిషనర్‌ తేజ్‌ భరత్‌తో కలిసి ప్రారంభించారు. పైలాన్‌ నిర్మించి ప్రారంభోత్సవ శిలాఫలకాన్ని ఏర్పాటు చేసిన అధికారులు, పార్కు నిర్మాణ సమయంలో వేసిన శంకుస్థాపన శిలాఫలకాన్ని యోగా భవనంలో మూలన విడిచిపెట్టడం సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పారదర్శకంగా వ్యవహరించాల్సిన అధికారులు కూటమి నేతల మెప్పు కోసమే ఇలా వ్యవహరించారని స్థానికులు విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రారంభోత్సవ శిలాఫలకంలో పేర్లు రాయించడంలోను వీఎంఆర్డీఏ అధికారులు ప్రొటోకాల్‌కు తూట్లు పొడిచారు. ఎంపీపీ, జెడ్పీటీసీ పేర్లు లేకుండా చేసి ప్రొటోకాల్‌ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారు. ప్రొటోకాల్‌ పాటించకుండా పక్షపాతంగా వ్యవహరించిన వీఎంఆర్డీఏ అధికారుల తీరుపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేసేందుకు వైఎస్సార్‌సీపీ శ్రేణులు సిద్ధమవుతున్నట్లు తెలిసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement