ఆరోగ్యశ్రీ | - | Sakshi
Sakshi News home page

ఆరోగ్యశ్రీ

Feb 10 2026 7:40 AM | Updated on Feb 10 2026 7:40 AM

ఆరోగ్యశ్రీ

ఆరోగ్యశ్రీ

నెట్‌వర్క్‌ ఆస్పత్రులకు

పేరుకుపోయిన బిల్లులు

మొక్కుబడిగా 5 శాతం బిల్లులు

విడుదల చేసిన చంద్రబాబు ప్రభుత్వం

వచ్చే ఏప్రిల్‌ నుంచి

కొత్త హెల్త్‌ పాలసీకు సన్నాహాలు

అగమ్య గోచరంగా

వైద్య మిత్రల భవిష్యత్తు

పేదల ఆరోగ్య భరోసా దూరం

ఐసీయూలో

మొదటి నుంచి ఆరోగ్యశ్రీపై చంద్రబాబు ప్రభుత్వం నిర్లక్ష్యం కొనసాగుతూనే ఉంది. అడపా దడపా బకాయిలు విడుదల చేస్తున్నా, అవి కనీసం ఆస్పత్రుల రోజువారీ ఖర్చులకు కూడా సరిపోవడం లేదు. దీంతో నెట్‌వర్క్‌ ఆస్పత్రులు ఒక్కొక్కటిగా ఆరోగ్యశ్రీ సేవలకు స్వస్తి పలుకుతున్నాయి. ఈ పరిస్థితి పేదవాడి పాలిట మరణశాసనంగా మారుతోంది. క్యాన్సర్‌, కిడ్నీ వ్యాధులు, గుండె సంబంధిత సమస్యలతో అత్యవసర శస్త్రచికిత్సలు అవసరమైన రోగులు ఇప్పుడు ఆస్పత్రుల చుట్టూ కాళ్లు అరిగేలా తిరుగుతున్నారు. చేతిలో చిల్లిగవ్వ లేని నిరుపేదలకు ‘ప్రభుత్వం నుంచి డబ్బులు రావడం లేదు.. మేము వైద్యం చేయలేం’ అంటూ ఆస్పత్రులు ముఖం చాటేస్తుండటం దారుణం. ప్రభుత్వ అసమర్థతకు, నిధుల మళ్లింపునకు సామాన్యుడి ప్రాణాలు బలికావాల్సిందేనా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. రాజకీయ విమర్శలు, పథకాల పేర్ల మార్పుల మీద చూపిస్తున్న శ్రద్ధ, రోగి ప్రాణాలను కాపాడటంలో చూపకపోవడం ప్రభుత్వ ప్రాధాన్యతలను శంకిస్తోంది. మొత్తానికి ఒక గొప్ప సామాజిక భద్రత కవచంగా నిలిచిన ఆరోగ్యశ్రీ పథకం, నేడు పాలకుల నిర్లక్ష్యంతో పడకేసింది.

వైఎస్సార్‌ ఆశయం.. జగన్‌ విస్తరణ

ఆరోగ్యశ్రీ అంటే తెలుగు రాష్ట్రాల్లో ముందుగా గుర్తుకు వచ్చే పేరు స్వర్గీయ వై.ఎస్‌. రాజశేఖర రెడ్డి. 2008లో ఆయన ప్రారంభించిన ఈ పథకం రెండు దశాబ్దాలుగా పేదలకు ప్రాణదాతగా నిలిచింది. ఆయన మరణానంతరం వచ్చిన ప్రభుత్వాలు కొన్ని నిబంధనలతో దీనిని పరిమితం చేసినప్పటికీ, వై.ఎస్‌. జగన్‌ మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక ఈ పథకాన్ని విప్లవాత్మకంగా మార్చారు. చికిత్సల సంఖ్యను 1800 నుంచి ఏకంగా 3,257కు పెంచి, క్యాన్సర్‌ వంటి దీర్ఘకాలిక వ్యాధులకు కూడా ఉచిత చికిత్సను చేర్చారు. కుటుంబానికి రూ.25 లక్షల వరకు ఉచిత వైద్యం అందజేస్తూ, హైదరాబాద్‌, చైన్నె, బెంగళూరు వంటి నగరాల్లోని కార్పొరేట్‌ ఆస్పత్రుల్లో కూడా సేవలు పొందేలా విస్తరించారు. కేవలం వైద్యమే కాకుండా, శస్త్రచికిత్స అనంతరం రోగి కోలుకునే వరకు జీవనోపాధి కోసం ‘ఆరోగ్య ఆసరా’ కింద రోజుకు రూ. 225 చొప్పున నెలకు గరిష్టంగా రూ.5 వేలు నేరుగా వారి ఖాతాల్లో జమ చేసి అండగా నిలిచారు.

ఆరోగ్యశ్రీ నిర్వీర్యానికి కుట్ర

పేదలకు అండగా ఉండాల్సిన ప్రభుత్వం, రాజకీయ కారణాలతో వ్యవస్థలను నిర్వీర్యం చేయడంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. కేవలం సామాన్యులే కాకుండా, ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్‌ ఉద్యోగుల హెల్త్‌ స్కీమ్‌ , జర్నలిస్టుల వైద్య సేవలు కూడా ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారాయి. నిరుపేదల సంజీవనిగా పేరుగాంచిన ఈ పథకానికి ఉరి బిగించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోందని బాధితులు వాపోతున్నారు. పథకం పేరు మార్చి, కార్పొరేట్‌ శక్తులకు మేలు చేసేలా ఇన్సూరెన్స్‌ పద్ధతిని తీసుకువస్తే, సామాన్యుడికి ఉచిత వైద్యం అందడం కష్టమేనన్న వాదనలు వినిపిస్తున్నాయి.

నూతన హెల్త్‌ పాలసీ.. ఆరోగ్యమిత్రల ఆందోళన

ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రజల మనసుల నుంచి తుడిచిపెట్టేందుకు చంద్రబాబు ప్రభుత్వం రహస్యంగా పావులు కదుపుతోందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జీవీఓ నంబర్‌ 162 ద్వారా ‘యూనివర్సల్‌ హెల్త్‌ పాలసీ’ని తీసుకురావడానికి కసరత్తు చేస్తోంది. దీనికోసం ఇప్పటికే టెండర్లు పిలవడం, పలువురు బిడ్డర్లు పాల్గొనడం చర్చనీయాంశంగా మారింది. వచ్చే ఏప్రిల్‌ నుంచి ఈ కొత్త పాలసీని అమల్లోకి తెచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఆయుష్మాన్‌ భారత్‌ , ఇతర ఇన్సూరెన్స్‌ మోడల్స్‌ను కలిపి కొత్త విధానం తెస్తే, ప్రస్తుతం అమల్లో ఉన్న ఆరోగ్యశ్రీ రద్దవుతుందన్న భయం ప్రజల్లో నెలకొంది. ఈ మార్పుల వల్ల ఆస్పత్రుల్లో రోగులకు మార్గదర్శకులుగా ఉంటూ సేవలందిస్తున్న ‘ఆరోగ్యమిత్ర’ల భవిష్యత్తు కూడా అగమ్యగోచరంగా మారింది. వారి ఉద్యోగ భద్రతపై ప్రభుత్వం ఎటువంటి స్పష్టత ఇవ్వకపోవడంతో వందలాది కుటుంబాలు ఆందోళన చెందుతున్నాయి.

ఒకప్పుడు నిరుపేదల గుమ్మం వద్దకు కార్పొరేట్‌ వైద్యాన్ని చేర్చి, చావు అంచుల్లో ఉన్న వేలాది మందికి పునర్జన్మ ప్రసాదించిన ‘ఆరోగ్యశ్రీ’ పథకం నేడు ఐసీయూలో కొట్టుమిట్టాడుతోంది. ధనవంతులకే పరిమితమైన కార్పొరేట్‌ ఆస్పత్రుల గడపను సామాన్యుడు కూడా ధైర్యంగా తొక్కవచ్చన్న నమ్మకాన్ని కలిగించిన ఈ వ్యవస్థ, ప్రస్తుతం చంద్రబాబు ప్రభుత్వ ఉదాసీనత వల్ల కుప్పకూలుతోంది. నిన్నటి వరకు పేదవాడి గుండెల్లో ధైర్యం నింపిన ఈ పథకం, నేడు అదే గుండెల్లో ఆందోళన నింపుతూ ‘అనారోగ్యశ్రీ’గా మారుతోంది. చంద్రబాబు సర్కార్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రైవేట్‌, కార్పొరేట్‌ ఆస్పత్రులకు చెల్లించాల్సిన వేల కోట్ల రూపాయల బకాయిలను పెండింగ్‌లో పెట్టడంతో, చికిత్సల ప్రక్రియ స్తంభించిపోయింది. అప్పులు తెచ్చి వైద్యం అందించలేమని ఆస్పత్రుల యాజమాన్యాలు మొండికేస్తుంటే, చికిత్స కోసం కార్డు పట్టుకుని వెళ్తున్న సామాన్యుడికి ఆస్పత్రి గేట్ల దగ్గరే చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి. – మహారాణిపేట

బకాయిల సెగ.. అందని ‘ఆసరా’

చంద్రబాబు ప్రభుత్వం బాధ్యతలు చేపట్టిన తర్వాత పరిస్థితి తలకిందులైంది. జిల్లా విషయానికొస్తే, సుమారు 92 ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలు అందుతున్నాయి. ఇందులో 50 నెట్‌వర్క్‌ ఆస్పత్రులు, 19 ప్రభుత్వ ఆస్పత్రులు, 23 డెంటల్‌ ఆస్పత్రులు ఉన్నాయి. ప్రస్తుతం ఈ ఆస్పత్రులకు సుమారు రూ.90 కోట్ల మేర బకాయిలు పెండింగ్‌లో ఉన్నట్లు సమాచారం. బకాయిల కోసం కార్పొరేట్‌ ఆస్పత్రులు సమ్మెకు దిగడం, ప్రభుత్వం నామమాత్రంగా 5 శాతం నిధులు విడుదల చేయడంతో తాత్కాలికంగా సేవలు కొనసాగుతున్నా, పూర్తిస్థాయి భరోసా కరువైంది. మరోవైపు గత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేసిన ‘ఆరోగ్య ఆసరా’ పథకం ఇప్పుడు పూర్తిగా మూలనపడింది. డిశ్చార్జ్‌ అయిన రోజూనే ఖాతాల్లో పడాల్సిన నగదు ఇప్పుడు అందని ద్రాక్షలా మారింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement