పీహెచ్‌సీ స్థలంలో గ్రౌండ్ నిర్మాణంపై హైకోర్టు నోటీసులు
నాతవరం: నిబంధనలు పాటించకుండా కూటమి నేతలకు తలొగ్గి అధికారులు పీహెచ్‌సీ స్థలంలో వాలీబాల్ గ్రౌండ్ నిర్మాణ పనులు చేయడంపై హైకోర్టు కలెక్టరు, ఇతర శాఖల అధికారులకు నోటీసులు పంపింది. ప్రభుత్వం నాతవరంలో వాలీబాల్ గ్రౌండ్ నిర్మించేందుకు గతేడాది నిధులు మంజూరు చేసింది. ఈనిధులతో అన్ని వర్గాల ప్రజలు అభీష్టం మేరకు నిబంధనలు అనుసరించి పనులు చేయాలి. క్షేత్రస్థాయి అధికారులు నిబంధనలు పాటించకుండా కూటమి నేతలు చెప్పినట్టుగా పీహెచ్‌సీ స్థలంలో ఏకపక్షంగా జిల్లా క్రీడాధికారి శైలజ, ఎంపీడీవో శ్రీనివాస్, తహసీల్దార్ ఎ.వేణుగోపాల్, పంచాయతీరాజ్‌శాఖ జేఈ వెంకటేశ్మరమ్మ డిసెంబరులో భూమి పూజ చేసి పనులు ప్రారంభించేశారు. గతంలో ఈ ఆస్పత్రి స్థలం ఇచ్చిన దాతలు స్పష్టంగా ఈ స్థలాన్ని ఆస్పత్రి కోసమే వినియోగించాలని నిర్దేశించారు. అయితే కూటమి నేతలు ఒత్తిళ్లతో పీహెచ్‌సీ అభివృద్ధి కమిటీ చైర్మన్ ఎంపీపీ లక్ష్మణమూర్తి తీర్మానం లేకుండా, పంచాయతీ సర్పంచ్ రాణికి తెలియకుండా, గ్రామసభ ఆమోదం లేకుండా పనులు చేపట్టారు. దీనిపై కలెక్టర్‌కు, డీఎంహెచ్‌వోకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోయింది. ఈ నేపథ్యంలో నాతవరం సర్పంచ్ గొలగాని రాణి హైకోర్టును ఆశ్రయించారు. ఏడు శాఖల అధికారులను కూటమి నేతను ప్రతివాదులు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ పీహెచ్‌సీ స్థలంలో నిబంధనల ప్రకారమే వాలీబాల్ గ్రౌండ్ నిర్మాణ పనులు చేస్తున్నారా లేదా అనే విషయాలను క్షేత్ర స్థాయిలో పరిశీలించి వెంటనే నివేదిక పంపించాలని కలెక్టరుకు నోటీసులో పేర్కొ న్నారు. హైకోర్టు నుంచి కలెక్టరు, డీఎంహెచ్‌వో, ఆర్డీవో ఎంపీడీవో, తహసీల్దార్, జిల్లా క్రీడాధికారి, పంచాయతీరాజ్ జేఈ, పంచాయతీ కార్యదర్శికి నోటీసులు రావడంతో మండలంలో అలజడి నెల కొంది. ఈ విషయంపై నాతవరం ఎంపీడీవో శ్రీనివాస్‌ను సంప్రదించగా హైకోర్టు నుంచి నోటీసులు వచ్చాయన్నారు. దీనికి సంబంధించి నివేదిక కలెక్టరు పంపించుతారన్నారు.


