స్కూటీ నుంచి జారిపడి యువకుడి దుర్మరణం
యలమంచిలి రూరల్ : స్నేహితుడిని ఇంటి వద్ద దింపడానికి స్కూటీపై వెళ్తుండగా స్పీడ్ బ్రేకర్ వద్ద జరిగిన ప్రమాదంలో వెనుక కూర్చున్న యువకుడు దుర్మరణం పాలైన ఘటన యలమంచిలి మండలం రేగుపాలెం వద్ద ఆదివారం అర్థరాత్రి చోటు చేసుకుంది. ఊహించని రీతిలో జరిగిన ఈ ప్రమాదం మృతుని కుటుంబంలో విషాదం నింపింది. యలమంచిలి రూరల్ ఎస్‌ఐ ఎం.ఉపేంద్ర తెలిపిన వివరాల ప్రకారం యలమంచిలి మున్సిపాలిటీ పరిధి పెదపల్లి కాలనీ(శ్రీరాంనగర్)కు చెందిన గగనం సుజయ్‌కుమార్ (27) పట్టణంలోని ధర్మవరం వీధికి చెందిన అతని స్నేహితుడు బోడపాటి కృప ఆకేష్‌తో కలిసి ఏపీ40 హెచ్‌టీ రిజిస్ట్రేషన్ నంబరు గల స్కూటీపై ఆదివారం అర్ధరాత్రి 12.15 గంటల సమయంలో రేగుపాలెం మీదుగా వెళ్తుండగా పాతజాతీయ రహదారి సాయిబాబా ఆలయం ఎదురుగా స్పీడ్ బ్రేకర్ వద్ద స్కూటీ బోల్తా పడింది. ప్రమాదంలో వెనుక కూర్చున్న గగనం సుజయ్‌కుమార్ తలకు తీవ్ర గాయమై రక్తస్రావమైంది. గాయపడిన యువకుడిని హైవే అంబులెన్సులో అనకాపల్లి ఎన్‌టీఆర్ ఆస్పత్రికి తరలించిన తర్వాత పరిస్థితి విషమంగా ఉండడంతో మరింత మెరుగైన చికిత్స నిమిత్తం విశాఖ కేజీహెచ్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సుజయ్‌కుమార్ సోమవారం మృతి చెందాడు. బోడపాటి కృప స్కూటీని నిర్లక్ష్యంగా, వేగంగా నడపడం స్పీడ్ బ్రేకర్ వద్ద వాహనాన్ని నియంత్రించకపోవడంతో ఈ ప్రమాదం జరిగినట్టు మృతుడి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు ఎస్‌ఐ తెలిపారు.


