నెలకు రూ.3.65 లక్షలు నీటికే ఖర్చు?
ముంచంగిపుట్టు: ఏకలవ్య విద్యార్థులకు తాగునీరు అందించడంలో విఫలమైన ప్రభుత్వం, అధికార యంత్రాంగం.. చలి ఉత్సవాల పేరిట రూ.కోట్ల ప్రజాధనాన్ని వృథా చేస్తూ సంబరాలు చేయడం దారుణమని అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం అసహనం వ్యక్తం చేశారు. మండలంలో జోలాపుట్టు పంచాయితీ లబ్బూరు ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలను శుక్రవారం ఆయన తనిఖీ చేశారు. విద్యార్థులు, ప్రిన్సిపాల్ సుమన్, ఉపాధ్యాయులతో మాట్లాడారు. వారి నుంచి సమస్యలు తెలుసుకున్నారు. విద్యార్థులు 461 మంది ప్రతిరోజు తాగునీటికి అవస్థలు పడుతున్నారన్నారు. దీంతో నెలకు 3.65 లక్షలు చెల్లించి ప్రైవేట్ వ్యక్తుల నుంచి ట్యాంకర్‌తో తాగునీటిని రప్పిస్తున్నామని విద్యార్థులు, ఉపాధ్యాయులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. ఉన్నతా ధికారులతో మాట్లాడి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం,ప్రభుత్వ అధికారులు నిద్ర మత్తులో ఉన్నారన్నారు. లబ్బూరు ఏకలవ్య పాఠశాలో బోరు బావి, మంచి పథకాలు ఏర్పాటు చేయకుండా విద్యార్థుల ఇబ్బందులు పట్టించుకోకపోవడం అన్యాయమని అన్నారు. కూటమి ప్రభుత్వం పాఠశాలల్లో చదువుకుంటున్న గిరిజన విద్యార్థులకు సరైన సౌకర్యాలు కల్పించడంలో పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. చలి ఉత్సవాల పేరుతో ఎవరికి ఉపయోగం లేని సంబరాలు చేస్తూ రూ.కోట్లు వృధా చేస్తున్నారని అన్నారు. ఏకలవ్యలో అసంపూర్తి భవనాలు, తాగునీటి సమస్యపై కలెక్టర్ దినేష్‌కుమార్, ఐటీడీఏ పీవో తిరుమణి శ్రీపూజ వెంటనే స్పందించాలని ఆయన డిమాండ్ చేశారు. అనంతరం ఉపాధ్యాయులు సమస్యలపై వినతి పత్రం అందజేశారు. జేసీఎస్ జిల్లా కోఆర్డినేటర అరబీరు జగబంధు, వైఎస్సార్‌సీపీ నేతలు తిరుపతిరావు, భాప్కర్, పులంధర్, జగత్, నారాయణ, సీతారాంపడాల్, ధనుంజయ్ పాల్గొన్నారు.
లబ్బూరు ఏకలవ్యలో తాగునీటికి
తీవ్ర ఇబ్బందులు
పాఠశాల దుస్థితిపై ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం అసహనం
విద్యార్థుల సమస్యలు ప్రభుత్వం
పట్టించుకోలేదని విమర్శ
చలి ఉత్సవ్ పేరిట రూ.కోట్లలో ఖర్చు దారుణమని ధ్వజం
నెలకు రూ.3.65 లక్షలు నీటికే ఖర్చు?


