క్రీడా మైదానాన్ని కాపాడండి
పాడేరు : తమ క్రీడా మైదానాన్ని వేరే శాఖకు అప్పగిస్తే చూస్తూ ఊరుకునేది లేదని స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు హెచ్చరించారు. ఈ మేరకు శుక్రవారం స్థానిక ఎమ్మెల్యే మత్య్సరాస విశ్వేశ్వరరాజును కలిసి క్రీడా మైదానాన్ని కాపాడాలని కోరుతూ వారు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ క్రీడా మైదానంలో ప్రతిరోజు తరగతులు ముగిసిన తర్వాత విద్యార్థులు సాయంత్రం పూట క్రీడలు ఆడుతున్నారని, ఉదయం పూట వాకర్స్‌కు కూడా ఎంతో ఉపయోగకరంగా ఉందన్నారు. ఎంతో ప్రాధాన్యం ఉన్న క్రీడా మైదానాన్ని ఇటీవల వైద్యారోగ్య శాఖకు డ్రోన్ల ద్వారా మందులు సరఫరా చేసేందుకు కేటాయించారన్నారు. దీనివల్ల విద్యార్థులు, పట్టణ ప్రజలు, వాకర్స్‌కు ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు. ఈ నిర్ణయాన్ని తక్షణమే వెనక్కి తీసుకొని డ్రోన్ల ద్వారా ఆస్పత్రులకు మందులు చేరవేసేందుకు అనువుగా ఉన్న మరొక స్థలం కేటాయించాలని ఎమ్మెల్యే కోరారు.
నేడు నిరసన : ప్రభుత్వ డిగ్రీ కళాశాల క్రీడా మైదానాన్ని పరిరక్షించాలనే లక్ష్యంతో కళాశాలలో చదువుతున్న 1470 మంది విద్యార్థులతో కలిసి శనివారం మధ్యాహ్నం కళాశాల క్రీడా మైదానం వద్ద పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపడుతున్నట్టు ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు తెలిపారు. ఈలోగా జిల్లా ఉన్నతాధికారులు తక్షణమే తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ జిల్లా అధికార ప్రతినిధి కూడా సురేష్‌కుమార్, ఐటీ విభాగం జిల్లా అధ్యక్షుడు కూడా సుబ్రమణ్యం, వైఎస్సార్‌సీపీ ఎస్టీ సెల్ నియోజకవర్గ అధ్యక్షుడు శరభ సూర్యనారాయణ పాల్గొన్నారు.
ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజుకు స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థుల వినతి


