నేడు మాఘ పౌర్ణమి జాతర
అచ్యుతాపురం రూరల్: ప్రసిద్ధి గాంచిన పూడిమడక మాఘపౌర్ణమి జాతరకు సర్వం సిద్ధమైంది. శనివారం సాయంత్రం వేణుగోపాల స్వామి జాగరణ మొదలుకుని ఆదివారం స్వామి చక్రస్నానాల మహోత్సవంతోపాటు సాయంత్రం వరకూ జాతర కొనసాగనుంది. సముద్ర స్నానాలకు అత్యంత అనువైన పూడిమడక తీరంలో జాతరకు జిల్లా నలుమూలల నుంచి 2 లక్షల వరకూ భక్తులు హాజరవుతారు. అధికారుల పర్యవేక్షణలో ఉత్సవ కమిటీ సభ్యులు భక్తులకు ఎటువంటి అవాంతరాలు కలగకుండా ఏర్పాట్లు చేశారు. తీరంలో పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. గ్రామంలో విద్యుత్ దీపాలంకరణతోపాటు వివిధ రకాల తినుబండారాలు, ఆట బొమ్మలు, నిత్యావసర సామగ్రి, స్టీల్, గృహోపకరణాలు వంటి అనేక రకాల స్టాల్స్ ఏర్పాటు చేశారు. వాటితోపాటు లక్షల రూపాయల్లో పచ్చి, ఎండు చేపల విక్రయాలు ఎక్కువగా జరుగుతాయి. మైరెన్ పోలీస్, లా అండ్ ఆర్డర్ పోలీసుల సంరక్షణలో తీరం వెంబడి బోట్లు ఏర్పాటు చేశారు. అత్యవసరంగా ప్రభుత్వం నుంచి 20 మంది గజ ఈతగాళ్లను సిద్ధం చేసింది. జాగరణ అనంతరం తీరంలో మహిళలు స్నానాలు చేసి దుస్తులు మార్చుకునేందుకు స్నానపు గదులు సమకూర్చారు. దాంతోపాటు బయో టాయిలెట్స్ ఏర్పాటు చేశారు. నాహనాల పార్కింగ్ చేసుకోవడానికి ప్రత్యేకంగా స్థలం కేటాయించారు. మాఘపౌర్ణమి జాతరకు భక్తులందరూ హాజరై జాగరణలు చేసి వేణుగోపాల లక్ష్మీ సమేత జగన్నాథ స్వామిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు తీసుకోవాలని ఉత్సవ కమిటీ సభ్యులు కోరారు. బీచ్ బాయ్స్ ఆధ్వర్యంలో కబడ్డీ, అంబేడ్కర్ యూత్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి వాలీబాల్ పోటీలు నిర్వహిస్తామన్నారు. ఇక్కడ ఆలయం పక్కన వైద్య శిబిరం ఏర్పాటు చేశారు.
రేవుపోలవరం జాతరకు భారీగా ఏర్పాట్లు
ఎస్.రాయవరం: మండలంలో రేవుపోలవరం తీరంలో వచ్చేనెల 1వ తేదీన పెద్ద ఎత్తున జరిగే మాఘపౌర్ణమి జాతరకు అధికారులు భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. ఏటా జరిగే ఈ జాతర సందర్భంగా రేవుపోలవరం సముద్ర తీరంలో పుణ్య స్నానమాచరించేందుకు లక్ష మందికి పైగా భక్తులు వస్తారు. వారికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా, అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ తీరానికి చేరుకోవడానికి అడ్డురోడ్డు జంక్షన్ ప్రధాన రహదారి. ఇక్కడ నుంచి ఆర్టీసీ పదుల సంఖ్యలో ప్రత్యేక బస్సులు నడుపుతుంది. జాతరకు ఎస్.రాయవరం, యలమంచిలి, కోటవురట్ల, నర్సీపట్నం, మాకవరపాలెం, గొలుగొండ, కృష్ణదేవి పేట, నాతవరం, నక్కపల్లి, కశింకోట మండలాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలివస్తారు. తీరంలో సముద్ర స్నానాలు ఆచరించే సమయంలో ప్రమాదాలు చోటు చేసుకోకుండా చర్యలు చేపట్టారు. మైరెన్, సివిల్ పోలీసులతో పాటు గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచనున్నారు. అడ్డురోడ్డు నుంచి తీరానికి చేరుకునే భక్తులకు పలు స్వచ్ఛంద సంస్థలు, యువజన సంఘాలు తాగునీరు, మజ్జిగ, అల్పాహారం అందించనున్నాయి. నూతన దంపతులు బ్రహ్మముడులు వేసుకుని సముద్రుడుకి పూజలు చేసి స్నాన మాచరిస్తారు.
గట్టి పోలీసు బందోబస్తు
భక్తులు తమ దుస్తులు, ఆభరణాలను భద్రంగా చూసుకోవాలి. వంద మంది పోలీసులు తీరంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బందోబస్తు ఏర్పాటు చేశాం. సీసీ కెమెరాల పర్యవేక్షణ, కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశాం.
చంద్రశేఖర్ రావు, ఇన్‌స్పెక్టర్, అచ్యుతాపురం
నేడు మాఘ పౌర్ణమి జాతర
నేడు మాఘ పౌర్ణమి జాతర


