సిరులతల్లి సన్నిధిలో నేడు సహస్రఘటాభిషేకం
డాబాగార్డెన్స్: బురుజుపేటలో కొలువైన కనకమహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో మార్గశిర మాసోత్సవాల సందర్భంగా చివరి గురువారం పూజలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా అమ్మవారికి సహస్రఘటాభిషేకం నిర్వహిస్తున్నట్లు ఈవో శోభారాణి తెలిపారు. ఈ కారణంగా మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు దర్శనాలు నిలిపివేస్తున్నారు. సాయంత్రం ఆరు గంటలకు నిర్వహించే పంచామృతాభిషేక సేవను కూడా రద్దు చేశారు. రాత్రి 7 గంటల తర్వాత తిరిగి దర్శనం ఉంటుంది. మధ్యాహ్నం టౌన్ కొత్తరోడ్డులోని జగన్నాథస్వామి ఆలయం వద్ద 20 వేల మంది భక్తులకు మహాన్నదానం ఏర్పాటు చేశారు. భక్తుల రద్దీ దృష్ట్యా జగదాంబ, కాన్వెంట్ జంక్షన్, వన్‌టౌన్ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. వాహనాల పార్కింగ్‌కు ప్రత్యేక స్థలాలను కేటాయించారు. భక్తుల సౌకర్యార్థం తాత్కాలిక మరుగుదొడ్లు, సీసీ కెమెరాలు, అదనపు సిబ్బందిని సిద్ధం చేసినట్లు ఈవో తెలిపారు.


