ఇసుక తవ్వకాల జోరు
● అధిక ధరలకు విక్రయిస్తూ ధనార్జన
● డుంబ్రిగుడలో టీడీపీ నేతల హవా
● పట్టించుకోని అధికార యంత్రాంగం
సాక్షి,పాడేరు: ఏజెన్సీలోని ప్రధాన గెడ్డల్లో ఇసుక తవ్వకాలు జోరుగా సాగుతున్నాయి. ఏజెన్సీలో అధికారిక ర్యాంపులు లేకపోవడం వల్ల ఇసుకకు మంచి డిమాండ్ ఉంది. దీంతో జి.మాడుగుల, పాడేరు, హుకుంపేట,పెదబయలు మండలాల్లో విస్తరించిన మత్స్యగెడ్డ ,హుకుంపేట మండలం దిగుడుపుట్టు, సంతారి గెడ్డలు, డుంబ్రిగుడ మండలంలోని చాపరాయి, కురిడి, గోరాపూర్ గెడ్డలలో తవ్వకాలు విచ్చలవిడిగా జరుగుతున్నాయి. రాత్రి, పగలు తేడా లేకుండా లారీలు, వ్యాన్లలో నిబంధనలకు విరుద్ధంగా తరలిస్తున్నారు. గెడ్డల్లో తవ్వకాల వల్ల గోతులు ఏర్పడటంతో ప్రమాదకర పరిస్థితులు నెలకొన్నాయి.
● ఇసుకను అధిక ధరలకు విక్రయించి కాసులు ఆర్జిస్తున్నారు. ట్రాక్టర్ రూ.3వేలు, వ్యాన్ రూ.10 వేలు, లారీ రూ.12 వేల నుంచి రూ.15 వేలకు విక్రయిస్తున్నారు. మత్స్యగెడ్డ, దిగుడుపుట్టు, సంతారి గెడ్డల్లో సేకరించిన ఇసుకను పాడేరు, జి.మాడుగుల, హుకుంపేట, పెదబయలు, ముంచంగిపుట్టు మండలం, డుంబ్రిగుడ మండలం గోరాపూర్, చాపరాయి, కురిడి గెడ్డల్లో సేకరించిన ఇసుకను డుంబ్రిగుడ, అరకులోయ ప్రాంతాల్లో విక్రయిస్తున్నారు. స్టాక్ పాయింట్ల ద్వారా ఇసుక అమ్మకాలు మరింత భారీగా జరుగుతున్నాయి.
● డుంబ్రిగుడ మండలంలో అన్ని ప్రధాన గెడ్డల్లోను ఇసుక అక్రమ తవ్వకాలను కొంతమంది టీడీపీ నేతలే ప్రోత్సహిస్తున్నారు. వీరికి చెందిన వ్యాన్లు, ట్రాక్టర్లు అధికంగా ఉన్నాయి. వీటి ద్వారా ఇసుకను తరలించి విక్రయిస్తున్నారు. అధికార పార్టీకి చెందిన వారి వాహనాలు కావడంతో అధికార యంత్రాంగం పట్టించుకోవడం లేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
చర్యలు తీసుకుంటాం: కలెక్టర్ దినేష్‌కుమార్
ఇసుక అక్రమ తవ్వకాలపై కలెక్టర్ దినేష్‌కుమార్‌ను వివరణ కోరగా ఏజెన్సీ గెడ్డల్లో ఇసుక అక్రమ తవ్వకాల నియంత్రణకు తగిన చర్యలు తీసుకుంటామన్నారు. గెడ్డల్లో ఇసుక సేకరణకు ఎలాంటి అనుమతులు లేవని ఆయన స్పష్టం చేశారు. అక్రమ ఇసుక తవ్వకాలు, అధిక ధరలకు విక్రయంపై తనిఖీలు చేపట్టి తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశిస్తామని ఆయన పేర్కొన్నారు.


